Begin typing your search above and press return to search.

పవన్ కులం పిచ్చిది కాదు... తెలంగాణ ఎన్నికలపై అంబటి కీలక వ్యాఖ్యలు!

నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్ట్ నీటి విడుద‌ల‌ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   1 Dec 2023 2:20 PM GMT
పవన్ కులం పిచ్చిది కాదు... తెలంగాణ ఎన్నికలపై అంబటి కీలక వ్యాఖ్యలు!
X

నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్ట్ నీటి విడుద‌ల‌ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. స‌రిగ్గా ఎన్నిక‌ల రోజు ఉద‌యాన్నే నాగార్జున‌సాగ‌ర్ వ‌ద్ద పెద్ద ఎత్తున ఏపీ, తెలంగాణ పోలీసులు మోహ‌రించడం.. ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య సాగ‌ర్‌ లో రాష్ట్రానికి హ‌క్కుగా రావాల్సిన నీటిని ఏపీ అధికారులు విడుద‌ల చేయడం చర్చనీయాంశం అయ్యింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఈ రాద్ధాంతం తెరపైకి తెచ్చారని పలు రాజకీయ పక్షాలు కామెంట్లు చేశాయి. ఈ విషయాలపై తాజాగా అంబటి స్పందించారు.

అవును... నాగార్జున సాగర్‌ డ్యాం నుంచి ఏపీకి రావాల్సిన నీటి విడుదల విషయంపై జరిగిన ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇందులో భాగంగా... ఈ వ్యవహారానికి రాజకీయంగా ముడిపెట్టడం తగదని.. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయని అన్నారు.

ఇదే క్రమంలో... తెలంగాణ‌లో ఒక పార్టీని గెలిపించాల్సిన‌ అవసరం, ఓడించాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని మంత్రి అంబటి స్పష్టం చేశారు. తెలంగాణ‌లో చంద్రబాబుకు చెందిన కుల‌సంఘాలు కాంగ్రెస్‌ కు మ‌ద్దతు ఇచ్చాయ‌ని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా త‌మ వాటాకు మించి చుక్కనీరు కూడా తీసుకోలేద‌ని చెప్పిన అంబటి... ఈ వివాదం చంద్రబాబు హ‌యాంలోనూ జ‌రిగింద‌ని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా మీడియాలో వచ్చిన కథనాలపై అంబటి ఫైరయ్యారు. ఇందులో భాగంగా నాగార్జున సాగర్‌ పై దండయాత్ర చేసినట్టు‌ ఎల్లోమీడియా వార్తలు రాసిందని ఫైరయ్యారు. సాగర్ నీటి విషయంలో తాము చేపట్టిన చర్య న్యాయమైనది, ధర్మమైనదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో... రాష్ట్ర విభజ తర్వాత నదీ జలాలను కూడా విభజించారని.. ఈ సమయంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఉమ్మడిగా ఉన్నాయని తెలిపారు.

వాస్తవానికి నది, డ్యాంలో సగం మాత్రమే తెలంగాణ పరిధిలో ఉంటుందని.. 26 గేట్లలోనూ 13 గేట్లు ఏపీ హక్కని.. కానీ మొత్తం డ్యాం ను తెలంగాణ ఆక్రమించిందని మంత్రి తెలిపారు. అయితే ఈ విషయాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని అన్నారు. మన నీరు మనం తీసుకుంటే అధి దండయాత్ర ఎలా అవుతుందో రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా అంబటి డిమాండ్ చేశారు.

అనంతరం తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై అంబటి హాట్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా... తెలంగాణలో చంద్రబాబు కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయని.. రాహుల్, ప్రియాంక సభల్లో కాంగ్రెస్ జెండాలతో పోటీగా టీడీపీ జెండాలు కూడా కనిపించాయని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులను ఓడించటానికి చంద్రబాబు కులం వారు భారీగా డబ్బు ఖర్చు పెట్టారని అంబటి చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో... తెలంగాణలో అవసరం లేని జనసేన.. ఏపీలో అవసరమా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా... పవన్‌ కల్యాణ్ పిచ్చోడేమోకానీ, ఆయన కులం పిచ్చిది కాదని చంద్రబాబు గుర్తించాలని మంత్రి అంబటి ఘాటుగా వ్యాఖ్యానించారు.