Begin typing your search above and press return to search.

కానిస్టేబుల్ కొడుకువేనా పవన్?: అంబటి

జగన్ పై సీమలో దుష్ప్రచారం చేసింది చంద్రబాబు అని, అందుకే ప్రాజెక్టుల పేరుతో అక్కడ పర్యటిస్తున్నారని అంబటి విమర్శించారు

By:  Tupaki Desk   |   5 Aug 2023 4:28 PM GMT
కానిస్టేబుల్ కొడుకువేనా పవన్?: అంబటి
X

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంగళ్లు, పుంగనూరు పర్యటనలు తీవ్ర ఉద్రిక్తత నడుమ సాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకొని టిడిపి కార్యకర్తలపై దాడి చేయడాన్ని ప్రతిపక్ష నేతలు ఖండిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ దాడి ఘటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఖండించారు. దీంతో, పవన్ పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. కానిస్టేబుల్ కొడుకువై ఉండి పోలీసులను గాయపరిచిన దౌర్జన్యకారులను బలపరుస్తన్నావేటి ‘బ్రో’ అంటూ పవన్ పై అంబటి సెటైర్లు వేశారు.

జగన్ పై సీమలో దుష్ప్రచారం చేసింది చంద్రబాబు అని, అందుకే ప్రాజెక్టుల పేరుతో అక్కడ పర్యటిస్తున్నారని అంబటి విమర్శించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు కుట్రకు తెరలేపారని అంబటి ఆరోపించారు.

పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబు కారణమని, బైపాస్ నుండి వెళ్తమని చెప్పినా చంద్రబాబు పుంగనూరు టౌన్ లో నుంచి వచ్చే ప్రయత్నం ఎందుకు చేశారని నిలదీశారు. ఆ క్రమంలోనే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారని, దాంతో, పోలీసులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, బీరు బాటిళ్లతో దాడి చేశారని అంబటి ఆరోపించారు.

మదనపల్లె పీలేరు ప్రాంతాలను చేసేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించామని వాటిని అడ్డుకునేదుకు చంద్రబాబు గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్లి స్టే తెచ్చారని ఆరోపించారు. ఆ విషయం తెలిసిన స్థానికులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆ సమయంలోనే పుంగునూరులోకి వెళ్లేందుకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు పుంగనూరు టౌన్ లోకి వెళ్లకుండా వెళ్ళమని చెప్పి టిడిపి అంగీకరించిందని ఆ తర్వాత బైపాస్ ద్వారా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతోనే ఘర్షణ ఏర్పడిందని చెప్పారు.