పల్నాడు హింసకు ఆ ముగ్గురు.. పోలీసులే కారణమన్న అంబటి
ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న భారీ హింస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
By: Tupaki Desk | 20 May 2024 4:48 AM GMTఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న భారీ హింస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలింగ్ వేళ చెదురుముదురు ఘటనలు జరగటం తెలిసిందే. అందుకు భిన్నంగా పోలింగ్ ముగిసిన తర్వాత అనూహ్యంగా హింస చెలరేగిపోవటం షాకింగ్ గా మారింది. ఏపీలోని పలు జిల్లాల్లో చోటు చేసుకున్న హింస ఒక ఎత్తు అయితే.. పల్నాడు.. చిత్తూరు.. అనంతపురం జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏపీ వరకే కాదు జాతీయస్థాయిలోనూ అందరూ మాట్లాడుకునేలా చేసింది.
పోల్ తర్వాత చోటు చేసుకున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించటం.. ఏపీ సీఎస్.. డీజీపీలను పిలిపించుకొని వివరణ తీసుకోవటంతో పాటు.. పలువురు అధికారులపై చర్యలు తీసుకోవటం తెలిసిందే. ఈ హింసకు సంబంధించి అధికార వైసీపీ.. విపక్ష్ తెలుగుదేశానికి చెందిన వారు ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకున్నారు. జరిగిన హింసలో అత్యధికంగా టీడీపీకి చెందిన వారు బాధితులుగా ఉండటం.. అధికార వైసీపీకి చెందిన వారు బాధ్యులుగా ఉండటం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ హింసపై స్పందించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఈవీఎంలు ధ్వంసం చేయటం.. హింసాత్మక ఘటనలకు పాల్పడటం లాంటివి జరిగిన వైనంలో పోలీసులదే బాధ్యత అంటూ సరికొత్త రాగాన్ని వినిపించారు. ఈ హింసాత్మక ఘటనలకు పూర్తి బాధ్యత చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. పురంధేశ్వరిలేనన్న ఆయన.. పోలింగ్ కు ముందు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుతోనే పల్నాడు జిల్లాతో పాటు.. ఇతర ప్రాంతాల్లో అధికారుల్ని మార్చారని.. ఇలా మార్చిన చోటే గొడవలు జరిగిన అంశాన్ని ప్రస్తావించారు.
ఈ స్థాయిలో హింస ఎప్పుడూ చోటు చేసుకున్నది లేదని.. పల్నాడులో చోటు చేసుకున్న హింసను తీవ్రంగా తప్పు పట్టారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి బాధితుల్ని బెదిరిస్తున్నారన్న అంబటి.. నార్నెపాడు ఘటనపై సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబు కౌంటర్ కేసులు వేయిస్తున్నారన్నారు. తప్పుడు కసులతో ప్రోత్సహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు తమ ప్రత్యర్థులపై ఆరోపణలు చేసే అధికార వైసీపీ నేతల తీరుకు భిన్నంగా అంబటి.. పోలీసులే బాధ్యుల్ని చేయటం సంచలనంగా మారింది.