సంబరాల రాంబాబు.. 'చెట్టు' పాఠాలు!
ఈ క్రమంలో తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సంబరాల(అంబటి) రాంబాబు పర్యావరణ పాఠాలు చెబుతున్నారు.
By: Tupaki Desk | 17 July 2024 1:30 AM GMTవినేవాడుంటే.. చెప్పేవాడు.. చిరంజీవి అన్నట్టుగా ఉంది.. వైసీపీ నేతల వ్యవహారం. అధికారంలో ఉన్న ఐదేళ్లు.. కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించిన వైసీపీ నాయకులు.. అప్పటి మంత్రులకు.. ఇప్పుడు నీతులు-సూక్తులు గుర్తుకు వస్తున్నాయి. అంతేకాదు... పర్యావరణం-పరిరక్షణ అంటూ.. పాఠాలు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సంబరాల(అంబటి) రాంబాబు పర్యావరణ పాఠాలు చెబుతున్నారు.
రాష్ట్రంలో వృక్షాలు.. వాటి విలువల గురించి.. ఆయన తెగ బాధపడిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తం గా కూటమి సర్కారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. రూ. 5 కే మూడు పూటల అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి గాను ఆగస్టు 15కు ముహూర్తం కూడా పెట్టుకుంది. దీంతో ఏర్పాట్లు కూడా అదే రేంజ్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న భవనాల్లో వాటిని కొనసాగిస్తుండగా.. లేని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సంబరాల రాంబాబు.. నియోజకవర్గం సత్తెనపల్లిలోని మెయిన్ రోడ్డుపై ఇప్పటికే ఉన్న అన్న క్యాంటీన్ భవనానికి.. రంగులు వేశారు. అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ఈ క్యాంటీన్‌కు ముందు భారీ వేప వృక్షం ఉంది. దీని వల్ల క్యాంటీన్ మూసుకుపోయింది. పైగా.. ప్రధాన రహదారిపై ఉండడంతో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడింది. మహా వృక్షం కావడంతో.. కొమ్మలు రోడ్డు మీదకు చొచ్చుకువచ్చాయి.
దీంతో అటవీ శాఖ నుంచి ముందస్తు అనుమతితో అన్న క్యాంటీన్ కోసమే కాకుండా.. రహదారిపై ప్రయా ణికులకు సౌకర్యంగా ఉండేలా.. కొమ్మలను తొలగించారు. దీనికి యంత్రాలు వినియోగించారు. అసలు వృక్షాన్ని ఎవరూ కదపలేదు. ఆ మాను ఆలానే ఆరోగ్యంగా కూడా ఉంది. అయితే.. అంబటి మాత్రం దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసి.. ఇదీ వీరు చేస్తున్న నిర్వాకం.. వందేళ్ల మహావృక్షాన్ని కూల్చేస్తున్నారని కామెంట్లు చేశారు. అయితే.. దీనిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
అప్పటి ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో కూల్చిన చెట్లెన్ని.. నేల రాలిన..కొమ్మలెన్నో గుర్తున్నాయా? అంబటీ అని ప్రశ్నిస్తున్నారు. నీతులు చెప్పేముందు.. మీ హయాంలో ప్రజలకు నీడ కల్పించే చెట్లకే నీడ లేకుండా.. పోయిందన్న విషయం గుర్తులేదా? లక్షలాది వృక్షాలను అడ్డదిడ్డంగా నరికేసిన.. చెట్ల హంతకులు మీరు కాదా? అని నిలదీస్తున్నారు.