అక్రమ మద్యం వస్తుందనే అసలు మద్యం ఆపలేదు: అంబటి
తమ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీల్లో 98 శాతం అమలు చేశామని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 17 April 2024 2:30 AM GMTఏపీలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వైసీపీ సర్కారు.. గత 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసామని.. సీఎం జగన్ సహా మంత్రులు, పార్టీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు... ప్రతిపక్షాలు మాత్రం కేవలం 2 శాతం మాత్రమే అమలు చేశారని.. మిగిలిన 98 శాతం హామీలను బుట్టదాఖలు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాయకులు ఇటీవల కాలంలో వీటిపై వివరణ ఇస్తున్నారు. తాజాగా మంత్రి, సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. తమ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీల్లో 98 శాతం అమలు చేశామని పేర్కొన్నారు.
అయితే.. ఎన్నికల వేళ ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్నిమాత్రం అమలు చేయలేక పోయామన్నారు. అయితే.. ఇది ఎందుకు అమలు చేయలేకపోయారనే విషయంపై ఆయన చిత్రమైన వివరణ ఇచ్చారు. మద్యాన్ని రాష్ట్రంలో నియంత్రిస్తే.. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రీతుల్లో మద్యం రాష్ట్రంలోకి వస్తుందని.. అదేసమయంలో నాటు సారా పెరిగిపోయే ప్రమాదం ఉందని.. దీనిని అరికట్టడం చాలా కష్టమని.. అందుకే మద్య నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయలేక పోయిన మాట వాస్తవమేనని చెప్పారు. అందుకే.. పేదలకు అందుబాటులో లేని విధంగా మద్యం ధరలను ఆకాశానికి పెంచామని చెప్పారు.
ఈ ఒక్క హామీని తాము అమలు చేయలేక పోయామని అంబటి వివరించారు. ఇక, ఇదే విషయంపై పార్టీ కీలక నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి కూడా .. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంపూర్ణ మద్య నిషేధం ఒక్కటే తాము అమలు చేయలేక పోయామని చెప్పారు. దీనికి ఆయన కూడా సేమ్ రీజన్లనే చెప్పారు. అయితే.. ప్రజల నుంచి మాత్రం వీరి వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ముందు హామీ ఇచ్చేప్పుడు ఈ విషయం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. వైసీపీ నేతలు చెబుతున్నట్టు ఈ ఒక్కటే కాకుండా మరికొన్ని హామీలను కూడా అమలు చేయలేక పోయారు.
1) పోలవరం పూర్తి చేస్తామన్నారు చేయలేదు.
2) ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. చేయలేదు.
3) ఉద్యోగులకు సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా చేయలేదు.
4) వెనుక బడిన జిల్లాలకు నిధులు తెస్తామన్నారు. ఇదీ సాధించలేదు.
5) కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామన్నారు. సాధ్యం కాలేదు.
6) విశాఖ రైల్వే జోన్ సాధిస్తామన్నారు. ఇది ఇంకా పట్టాలకెక్కలేదు.