వైసీపీలో బానిసత్వం అంటూ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు!
టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ, కామెంట్లకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 May 2024 9:25 AM GMTటీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ, కామెంట్లకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తొలుత వైసీపీ సర్కార్ పనితీరుని, జగన్ విజన్ ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్టులు అప్పట్లో తీవ్ర వైరల్ గా మారాయి. అనంతరం జగన్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వడంతో వైసీపీలో ఆయన పొలిటికల్ ఇన్నింగ్స్ పై చాలామంది ఒక కచ్చితాభిప్రాయానికి వచ్చేశారు కూడా!
ఈ క్రమంలో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి అంబటి రాయుడు పోటీ చేయబోతున్నారని.. ఆ టిక్కెట్ కోసమే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని రకరకాల కథనాలు వినిపించాయి. ఇంతలో ఏమి జరిగిందో ఏమో కానీ... అనూహ్యంగా జనసేన ఆఫీసులో కనిపించారు రాయుడు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు. ఆయన్ని అభినందిస్తూ ఆన్ లైన్ వేదికగా స్పందించారు!
దీంతో... వైసీపీతో అంబటి రాయుడికి చెడిందని.. ఆయన జనసేన గూటికి చేరారని కథనాలు మొదలయ్యాయి. అనంతరం కాస్త సైలంట్ గా కనిపించిన రాయుడు.. తనకు మ్యాచ్ ఉండటం వల్ల విదేశాలకు వెళ్తున్నట్లు ఆన్ లైన్ వేదికగా పెద్ద పోస్టే పెట్టారు! ఈ క్రమంలో... జనసేన స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో రాయుడు పేరు ప్రకటిస్తూ ఆ పార్టీ ఒక నోట్ విడుదల చేసింది. దీంతో.. రాయుడి పొలిటికల్ ఇన్నింగ్స్ టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది.
దీంతో... ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ కూటమి తరుపున ప్రచారం చేయడానికి అంబటి రాయుడు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా... కృష్ణాజిల్లాలో జనసేన మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులు.. వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ ల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో... రాయుడి సేవలను జనసేన పూర్తిగా వినియోగించుకునేలా ఉందనే అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో మైకందుకున్న అంబటి రాయుడు... యువత బంగారు భవిష్యత్తు, రాష్ట్ర అద్భుత ప్రగతి కోసం... జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం ప్రజల ముందు ఉందని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీకి దూరమయ్యిన అంశంపై స్పందించిన రాయుడు... వైసీపీలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చినట్లు చెప్పుకురావడం గమనార్హం!