Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే కోరికను తిరస్కరించిన అంబటి రాయుడు!

అపార ప్రతిభా సంపత్తులు ఉన్న క్రికెటర్‌ గా అంబటి రాయుడు ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు.

By:  Tupaki Desk   |   4 Aug 2024 11:28 AM GMT
ఆ ఎమ్మెల్యే కోరికను తిరస్కరించిన అంబటి రాయుడు!
X

అపార ప్రతిభా సంపత్తులు ఉన్న క్రికెటర్‌ గా అంబటి రాయుడు ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఆయన కొంతకాలం వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీ తరఫున గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి, అయితే.. ఊహించనివిధంగా వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.

ఇటీవల ఏపీ ఎన్నికల సందర్భంగా అంబటి రాయుడు సైతం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి కొన్నిచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా ఇప్పటికే క్రికెట్‌ లో అన్ని ఫార్మాట్‌ లకు అంబటి రాయుడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో అంబటి రాయుడుకు సైతం హైదరాబాద్‌ లో తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించాలని హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కోరారు.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం.. క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్, షూటర్‌ ఇషా సింగ్, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కు 600 చదరపు గజాల చొప్పున హైదరాబాద్‌ లో ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో అంబటి రాయుడు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజాలకు కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఆయన తన డిమాండ్‌ ను వినిపించారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చేసిన డిమాండ్‌ పై అంబటి రాయుడు స్పందించారు. తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇంటి స్థలం అక్కర్లేదని స్పష్టం చేశారు. తనకు కూడా ఇంటి స్థలం ఇవ్వాలని తన పేరును చేర్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర క్రీడాకారులకు ఇంటి స్థలాలు కేటాయించడం పట్ల అంబటి రాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పుడే కాదు గతంలోనూ తాను ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఆశించలేదని అంబటి రాయుడు గుర్తు చేశారు. తనకు ఇంటి స్థలం అవసరం లేదన్నారు. ఇంటి స్థలం అవసరం ఉన్న ఇతర క్రీడాకారులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందుదామా? వేటిని దక్కించుకుందామా అనే వ్యక్తులున్న ఈ రోజుల్లో హైదరాబాద్‌ లాంటి నగరంలో విలువైన ప్రాంతంలో ఇళ్ల స్థలాన్ని తిరస్కరించడం ఒక్క అంబటి రాయుడికే చెల్లు అని ప్రశంసలు కురుస్తున్నాయి.