ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు... అంబటి రాయుడు!
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీం ఇండియా మార్జీ క్రికెటర్ అంబటి రాయుడు ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 28 April 2024 8:25 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా అనూహ్యంగా... టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు... ఏపీలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో పర్యటించిన రాయుడు... గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపైనా.. సీఎం జగన్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీం ఇండియా మార్జీ క్రికెటర్ అంబటి రాయుడు ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వైసీపీ ఎమ్మెల్యేలు సైతం సీఎం జగన్ ని కలిసే పరిస్థితి ఉండదని.. రాచరికం, ఆధిపత్య ధోరణి తరహాలోనే ఆ పార్టీ పాలన సాగిందని విమర్శించారు.
ఈ క్రమంలో గతంలో భేటీ అయిన రాయుడు... తాను వైసీపీ వాళ్ల దగ్గరకు వెళ్లినప్పటికీ అక్కడి వాతావరణం చూశాక ప్రజాసేవకు ఇది వేదిక కాదనిపించిందని.. అందుకే వెంటనే బయటకు వచ్చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో... పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ఆశయాలు నచ్చాయని చెప్పిన రాయుడు... అందువల్లే జనసేన పార్టీలోకి వచ్చినట్లు చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలో... రాష్ట్ర ప్రగతికి, యువతకు ఉపాధి కోసం టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థులను అంతా కలిసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా... ప్రతి ఓటు సద్వినియోగం కావాలని పిలుపునిచ్చిన ఆయన.. ఏపీలో రాచరికం తరహా పాలన సాగుతోందని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో... యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సూచించిన అంబటి రాయుడు.. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.
కాగా... అంబటి రాయుడు వైసీపీలో చేరిన తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వైసీపీ తరపున గుంటూరు ఎంపీ టికెట్ ను ఆశించారని.. అయితే ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని, ఫుల్ టైం పొలిటీషియన్స్ కే టిక్కెట్లని ఆ పార్టీ నుంచి సంకేతాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.