బాబా సాహెబ్ కోసం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ !
దేశానికి అత్యుత్తమైన రాజ్యాంగాన్ని రచించిన వారు బాబా సాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖితపూర్వకంగా రాజ్యాంగంగా రికార్డులకు ఎక్కింది.
By: Tupaki Desk | 13 April 2025 3:53 AMదేశానికి అత్యుత్తమైన రాజ్యాంగాన్ని రచించిన వారు బాబా సాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖితపూర్వకంగా రాజ్యాంగంగా రికార్డులకు ఎక్కింది. బాబా సాహెబ్ మేధావిగా అందరి మన్ననలు అందుకున్న రాజనీతి కోవిదుడు గా మన్ననలు అందుకున్నారు. ఆయన పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో కొన్నాళ్ళు పనిచేసినా తరువాత కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చారు.
ఇక కాంగ్రెస్ ఆయనను ఎన్నికల్లో ఓడించింది అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తారు. అయితే బాగా సాహెబ్ ని తాము గౌరవించామని ఆయన బాటలో నడుస్తున్నామని కాంగ్రెస్ అంటుంది. ఇటీవల కాలంలో చూస్తే జాతీయ రాజకీయాల్లో బాబా సాహెబ్ కోసం అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని అంటున్నారు.
మహాత్మా గాంధీ బాబా సాహెబ్ ల మార్గదర్శకత్వంలో అంటూ కర్ణాటకలో గత డిసెంబర్ లో జరిగిన పార్టీ సమావేశాలలో తీర్మానించిన కాంగ్రెస్ ఇటీవల గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో మరింతగా వారి భావజాలాన్ని తాము అనుసరిస్తూ ముందుకు సాగుతామని నొక్కి చెప్పింది. దేశంలో దళితులు బడుగులు బహుజనుల మేలు కాంగ్రెస్ తోనే అని కూడా ఆ పార్టీ చెబుతోంది.
మరో వైపు చూస్తే బాబా సాహెబ్ కి భారత రత్న ప్రకటించింది తమ పార్టీయే అని బీజేపీ చెబుతోంది. పార్లమెంట్ లో ఆయన చిత్రపటాన్ని పెట్టించింది కూడా తామే అని అంటోంది. బాబా సాహెబ్ ని గత ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ పట్టించుకోలేదని 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆశయాలను అమలు చేస్తూ మరింతగా గౌరవిస్తున్నారని చెబుతోంది.
దీనికి అంతటికీ కారణాలు ఉన్నాయి. దేశంలో దళితుల పార్టీగా ఆవిర్భవించిన బీఎస్పీ జాతీయ స్థాయిలో తగ్గుతోంది. వరస పరాజయాలతో వ్యూహాత్మకం తప్పిదాలతో బీఎస్పీ చతికిలపడుతోంది. దాంతో దళిత ఓటు బ్యాంక్ అన్నది బీఎస్పీ నుంచి ఆకర్షించేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ గట్టిగా పోటీ పడుతున్నాయని అంటున్నారు.
యూపీ సహా దేశంలో కీలక రాష్ట్రాలలో రాజకీయ పట్టుని నిలుపుకోవాలంటే సరికొత్త వ్యూహాలు అవసరం అని బీజేపీ భావిస్తోంది. ఇదే సమయంలో బీఎస్పీ వల్లనే తమ ఓటు బ్యాంక్ బక్కచిక్కి తాము తగ్గాల్సి వచ్చిందని తిరిగి పూర్వ వైభవం దక్కాలీ అంటే ఆ పార్టీ ఓటు బ్యాంక్ కే కొల్లగొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది.
ఇలా బీజేపీ కాంగ్రెస్ ల మధ్య ఇపుడు వార్ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న బాబా సాహెబ్ జయంతి ఉంది. ఆ వేడుకలను అంగరంగ వైభవంగా జరపాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ నెల 14 నుంచి 25 వరకూ ఒక పది రోజులకు పైగా పల్లె పల్లెనా అంబేద్కర్ భావజాలంతో కార్యక్రమాలను చేపట్టి తద్వారా బీజేపీని కూడా గ్రౌండ్ లెవెల్ లో మరింతగా బడుగులకు దళితులకు చేరువ చేయాలని పట్టుదలగా ఉంది.
తమకు అంబేద్కర్ స్పూర్తి అని కమలం పార్టీ అంటోంది. బీజేపీ అందరి పార్టీ కావాలన్నది కమలనాధుల స్టాటజీ. అందుకే బాబా సాహెబ్ ని తమ వాడుగా చెప్పుకుని ముందుకు వెళ్తోంది అని అంటున్నారు. అటు కాంగ్రెస్ కూడా అంబేద్కర్ మావారు అని అంటోంది. చూడాలి మరి ఈ రాజకీయ పోరులో విజేత ఎవరు అవుతారో జనాలు ఎవరిని మెచ్చి నచ్చి అంబేద్కర్ వారసులుగా వరమాల వేస్తారో.