ఎస్సీ కమిషన్‌కు చేరిన విజయవాడ 'అంబేడ్కర్' విగ్రహం వివాదం
ఈ విగ్రహం చెంతనే అతి పెద్ద పార్కు, అతి పెద్ద లైబ్రరీలు, మ్యూజియం(అంబేడ్కర్ విశేషాలతో) ఏర్పాటు చేయాలని తలపోసింది
By: Tupaki Desk | 14 Aug 2024 3:07 PM GMTవిజయవాడ నడిబొడ్డన ఉన్న పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఏర్పాటు చేసిన విగ్రహం కంటే కూడా ఇది అతి పెద్దది, ఎత్తైనది కావడం గమనార్హం. ఎస్సీ సామాజిక వర్గాలను ఆకర్షించే ఉద్దేశంతోపాటు.. రాజ్యాంగ నిర్మాతకు సమున్నత గౌరవాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో దీనిని వైసీపీ ప్రభుత్వం 4 కోట్ల రూపాయల పైచిలు కు వ్యయంతో నిర్మించింది. ఈ విగ్రహం చెంతనే అతి పెద్ద పార్కు, అతి పెద్ద లైబ్రరీలు, మ్యూజియం(అంబేడ్కర్ విశేషాలతో) ఏర్పాటు చేయాలని తలపోసింది.
దీనిలో 60 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా పార్కు , లైబ్రరీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. ఇంతలోనే ఎన్నికలు రావడం.. వైసీపీ ప్రభుత్వం కూలిపోవడంతో తర్వాత వచ్చిన కూటమి సర్కారు.. గతంలో ఎంచుకున్న అమరావతిలో ని అంబేడ్కర్ విగ్రహాన్ని(నేలపాడు) నిర్మించాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుత నిర్మాణాలు నిలిచిపోయాయి. అయినప్పటికీ.. నిత్యం 10 వేల మంది వరకు దీనిని సందర్శిస్తున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల అంబేడ్కర్ విగ్రహానికి కింద భాగంలో ఏర్పాటు చేసిన ``ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి`` అనే పేరును కొందరు ఆగంతకులు తొలగించారు. ఇది రాజకీయంగా వివాదానికి దారితీసింది.
సాధారణంగా ఏ విగ్రహం ఏర్పాటు చేసినా.. సీఎం పేరును వేసుకోవడం పరిపాటి. ఇదే వైసీపీ కూడా చేసింది. అయితే.. ఇటీవల దుండగులు మాత్రం సీఎం జగన్ పేరును పెరికేశారు. దీనిని వైసీపీ నాయకులు తప్పపట్టారు. పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు. అదేవిధంగా పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. అయితే.. ఈ ఘటనను కూటమి ప్రభుత్వం సమర్థించుకుంది. ఒక సైకో ముఖ్యమంత్రి పేరును అంబేడ్కర్ విగ్రహం కింద పెట్టడం పాపమని పలువురు మంత్రులు సైతం వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ తన ఉద్యమాన్ని వేడెక్కించింది. దీనిని ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లింది.
తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో మాజీ మంత్రులు సురేష్ కుమార్, నాగార్జునలు ఢిల్లీలోని ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలుసుకున్నారు. విజయవాడలో జరిగిన ఘటనను ఆయన వివరించారు. పలు ఫొటోలను కూడా ఆయనకు అందించారు. ఎస్సీ కమిషన్ వచ్చి సందర్శించాలని.. బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం మారిన తర్వాత.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమపైనా, తమ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం.. ఆయనకు ఘన నివాళి అర్పించారని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించి మక్వానా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.