‘అమెరికా’ కల వదులుకోవాల్సిందేనా?
ఏక ధ్రువ ప్రపంచంలో ఏకైక సూపర్ పవర్ గా నిలిచిన అగ్ర రాజ్యం అమెరికాలో ఉద్యోగిగా కాలుమోపాలంటే హెచ్1బీ వీసా అవసరమనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Sep 2024 2:30 PM GMTఏక ధ్రువ ప్రపంచంలో ఏకైక సూపర్ పవర్ గా నిలిచిన అగ్ర రాజ్యం అమెరికాలో ఉద్యోగిగా కాలుమోపాలంటే హెచ్1బీ వీసా అవసరమనే సంగతి తెలిసిందే. అయితే హెచ్1బీ వీసా పొందడం చాలా కష్టమైన ప్రక్రియ. ఇటీవల కాలంలో హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా కఠిన నిబంధనలను అమలు చేస్తుండటంతో వీసా పొందడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా భారతీయ టెకీలు హెచ్1బీ వీసాతోనే అమెరికాలో ఉద్యోగాలకు వెళ్తుంటారు.
అయితే హెచ్1బీ వీసా లాటరీలో ఎంపిక కావడం, లేదా దాన్ని పునరుద్ధరించుకోవడం లేదా ఆమోదం పొందడం.. ఇలా ప్రక్రియ అత్యంత క్లిష్టంగా ఉంటుంది. అయితే.. ఇప్పుడు వీటికంటే కూడా వీసా స్లాట్ ను బుక్ చేసుకోవడమే అత్యంత కష్టంగా ఉందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదొక పెద్ద పీడకలగా మారుతోందని వాపోతున్నారు.
అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం స్టూడెంట్ వీసాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందని హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు చెబుతున్నారు. స్టూడెంట్ వీసా స్లాట్ లకు మాత్రమే యూఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో హెచ్1బీ వీసాకు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం చాలా కష్టంగా మారిందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
‘చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ ఏజెంట్లకు వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్ బుకింగ్‌ను ఔట్ సోర్స్ చేసిందా? నేను మూడు నెలలుగా హెచ్1బీ వీసా స్టాంపింగ్ కు డ్రాప్ బాక్స్ అపాయింట్‌మెంట్ కోసం వెతుకుతున్నాను. అందుబాటులో ఉన్న స్లాట్‌లు ఏవీ లేవు. గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఏజెన్సీల ద్వారా స్లాట్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని మిత్రుల ద్వారా విన్నాను. ఇది నిజమేనా?’ అని హెచ్1బీ వీసాను ఆశిస్తున్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘‘ఈ ఇబ్బంది కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రారంభమైంది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. అధికారిక యూఎస్, ఇండియా వెబ్‌సైట్ల ద్వారా భారతదేశంలో వీసా డ్రాప్ బాక్స్ అపాయింట్‌మెంట్ స్లాట్ ను కనుగొనడం ఒక పీడకలగా మారింది. కానీ బ్రోకర్లు/ఏజెంట్లు దానిని ’నిర్దిష్ట’ మొత్తానికి పొందొచ్చు. మీకు తెలుసా? ఇదొక కుంభకోణం జాగ్రత్త’’ అని ఆయన అమెరికా రాయబార కార్యాలయానికి ట్యాగ్ చేశారు.
‘‘భారతదేశంలో హెచ్1బీ వీసా పునరుద్ధరణ కోసం డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ పొందడం అనేది నిరాశకు మించినది. వ్యవస్థ ఎందుకు విచ్ఛిన్నమైంది’’ అని మరొకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అలాగే కొంతమంది దరఖాస్తుదారులు కూడా తమ నిరాశను వ్యక్తం చేశారు. స్లాట్ ను బుక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వెబ్ సైట్ సరిగ్గా పని చేయలేదని వాపోయారు.
ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు వీసా స్లాట్‌లు అందుబాటులో లేకపోవడంతో హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికే ఇన్ని ఇబ్బందులు ఉంటే ఇక అమెరికాలో గ్రీన్ కార్డ్ దశకు చేరుకునే వరకు వలస ప్రక్రియ ఎంత కష్టతరంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు.