Begin typing your search above and press return to search.

ఎఫ్ బీఐ చీఫ్ గా మనోడు.. ఇతడి బ్యాక్ గ్రౌండ్ ఏమంటే?

అలాంటిది ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరున్న ఎఫ్ బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కు బాస్ గా నియమితులయ్యారు భారత మూలాలు ఉన్న కశ్యప్ పటేల్.

By:  Tupaki Desk   |   2 Dec 2024 4:19 AM GMT
ఎఫ్ బీఐ చీఫ్ గా మనోడు.. ఇతడి బ్యాక్ గ్రౌండ్ ఏమంటే?
X

మన సీబీఐ గురించే చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరున్న ఎఫ్ బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కు బాస్ గా నియమితులయ్యారు భారత మూలాలు ఉన్న కశ్యప్ పటేల్. 44 ఏళ్లు ఉన్న ఆయన.. భారత సంతతికి చెందిన వారు. కశ్యప్ పటేల్ ను అమెరికాలో కాష్ పటేల్ గా ఫేమస్. తాజాగా ఆయన్ను ఎఫ్ బీఐ చీఫ్ గా పేర్కొంటూ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ నియామకం గురించి వెల్లడించారు ట్రంప్.

అవినీతి గుట్టురట్టు చేయటానికి.. న్యాయాన్ని కాపాడేందుకు.. అమెరికా ప్రజల పరిరక్షకే కాష్ తన కెరీర్ మొత్తం పని చేశారన్న ట్రంప్.. ‘‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్్ కు తదుపరి డైరెక్టర్ గా కశ్యప్.. కాష్ పటేల్ సేవలు అందిస్తారని ప్రకటించటానికి నేను గర్విస్తున్నాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. సూక్ష్మబుద్ధి ఉన్న న్యాయవాదిగా.. పరిశోధకుడిగా ఆయన్ను ట్రంప్ అభివర్ణించారు.

ఎఫ్ బీకు గతంలో ఉన్న విశ్వసనీయత.. ధైర్యాన్ని.. నైతిక నిష్ఠను కాష్ పటేల్ తిరిగి తీసుకొస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెరికా పాలనా యంత్రాంగంలో.. నిఘా.. దర్యాప్తు సంస్థల్లో విప్లవాత్మక మార్పులు అవసరమని భావిస్తున్న ట్రంప్.. తనకు వీర విధేయుడైన కాష్ పటేల్ ను ఎంచుకోవటం ఆసక్తికరంగా మారింది.

తాజా ప్రకటనతో జనవరి 20న అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే ట్రంప్.. ఆ వెంటనే ఎఫ్ బీ డైరెక్టర్ గా ప్రస్తుతం ఉన్న క్రిస్టఫర్ రే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే కాష్ పటేల్ ఈ కీలక పదవిని చేపట్టనున్నారు. అయితే.. కాష్ పటేల్ నియామకానికి సెనెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.

ఇక.. ఇతగాడి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే..

- కాష్ పటేల్ తల్లిదండ్రులు గుజరాతీలు. వారు మొదట ఉగాండాలో ఉండేవారు. అక్కడి పరిస్థితులు ఏ మాత్రం బాగోలేకపోవటంతో 1970లలో అక్కడి నుంచి పారిపోయి అమెరికాలోని లాంగ్ ఐలాండ్ లో స్థిరపడ్డారు.

- 1980లో న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో పుట్టిన కశ్యప్ (కాష్ పటేల్) 2005లో పేస్ వర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి టీచర్ ఆఫ్ లా పట్టా పొందారు. ఆ తర్వాత ఫ్లోరిడాలో ఎనిమిదేళ్లు పబ్లిక్ డిఫెండర్ గా.. తర్వాత ఫెడరల్ పబ్లిక్ డిపెండర్ గా పని చేశారు.

- అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. హత్య.. మారణాయుధాలకు సంబంధించిన నేరాలు.. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో తన వాదనలు వినిపించారు. 2014లో అమెరికా న్యాయశాఖ జాతీయ భద్రత విభాగంలో ట్రయల అటార్నీగా పని చేశారు.

- ట్రంప్ తో ఆయన పరిచయం.. 2016లో జరిగింది. హౌస్ం పర్మనెంట్ సెలెక్టు కమిటీలో స్టాఫర్ గా పని చేసే వేళలో ట్రంప్ కంట్లో పడ్డారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయంలో క్రిష్ భాగస్వామ్యం ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో రష్యా జోక్యం ఉందన్న ఆరోపణల వేళ.. ఈ అంశంపై విచారణ జరిపిన వైనంపై రిపబ్లికన్ల తరఫున వ్యతిరేకించటంతో కీలక పాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు.

- ట్రంప్ పై బైడెన్ సర్కారు తీరును నిరసిస్తూ గవర్నమెంట్ గ్యాంగ్ స్టర్స్ అనే పుస్తకాన్ని.. ట్రంప్ ను సింహంగా చిత్రీకరిస్తూ ద ప్లాట్ ఎగైనెస్ట్ ద కింగ్ అనే పుస్తకాల్ని రాశారు.

- గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిన తర్వాత కూడా ఆయనతోనే ఉండటం గమనార్హం. అదే ఆయనకు తాజాగా కీలక పదవిని చేపట్టే వీలు కలిగింది. ఇక.. క్రిష్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. భారత ప్రధాని మోడీకి అభిమానిగా చెబుతారు.

- అయోధ్యలో రామాలయంలో బాల రాముడి ప్రతిష్ఠ కార్యక్రమ వేళ అమెరికన్ మీడియా మొత్తం భారతదేశంలో హిందూ జాతీయవాదం పెరిగిపోతుందంటూ కథనాలు రాస్తే.. కాష్ మాత్రం వాటిని తీవ్రంగా ఖండించటం గమనార్హం. అంతేకాదు.. అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ భారత దేశానికి వచ్చినప్పుడు అహ్మదాబాద్ లో ఆయన ప్రసంగంలో సచిన్ టెండూల్కర్.. వివేకానందుడి పేర్లు వచ్చేలా చేయటంలో కాష్ కీ రోల్ ప్లే చేశారని చెప్పాలి. ఇప్పటికే పలువురు భారత మూలాలు ఉన్న వారంతా ట్రంప్ టీంలో ఉన్న వేళలో.. కాష్ నియామకం ఆసక్తికరంగా మారింది.