ఓడి గెలవొచ్చు..గెలిచి ఓడొచ్చు.. అమెరికా ఎన్నికల విడ్డూరం
రిపబ్లికన్ పార్టీ తరఫఉన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవైపు, డెమోక్రాట్ల అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మరోవైపు..
By: Tupaki Desk | 11 Oct 2024 10:30 AM GMTఅమెరికా అంటే డాలర్ డ్రీమ్స్.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా ఆ అగ్రరాజ్యంలో కొలువు చేయాలన్న కలలు ఉన్నవారే.. ప్రపంచంలో ఏం జరిగినా అమెరికాకు సంబంధం ఉన్నట్లే అనిపిస్తుంది. అలాంటి అమెరికాలో ఇప్పుడు ఎన్నికల కోలాహం కొనసాగుతోంది. వచ్చే నెల 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫఉన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవైపు, డెమోక్రాట్ల అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మరోవైపు.. ఇలాంటి సమయంలో అత్యంత ఆసక్తికరంగా మారాయి ఎన్నికలు. అయితే, అమెరికా ఎన్నికల్లో ఓ విచిత్రం ఉంది.. అదేమంటే..?
ఓట్లు ఎక్కువ వచ్చినా..
భారత్ వంటి దేశంలో ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు ఎక్కువ వస్తే వారే విజేత. కానీ, అమెరికాలో మాత్రం అలా కాదు.. అక్కడా ఇక్కడా ప్రజాస్వామ్యమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు ఎక్కువ వచ్చినా ఓడిపోవచ్చు! తక్కువ వచ్చినవారూ అధ్యక్షులు కావొచ్చు. గతంలో ఇలా జరిగింది కూడా. కాగా, అమెరికా ఎన్నికలు నాలుగేళ్లకోసారి జరుగుతాయి. అది కూడా నవంబరు తొలివారంలోనే కచ్చితంగా జరుగుతాయి. అక్కడి
ప్రజలు పార్టీలు/అభ్యర్థుల వారీగా ఓట్లు వేస్తారు. అయితే, ఇక్కడ అధ్యక్ష ఎన్నికల వ్యవస్థ ఉన్నా ఓటర్లు మాత్రం అధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకోరు. వారు వేసే ఓట్ల ఆధారంగా తొలుత ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు ఎన్నికవుతారు. ఇలా ఎన్నికయ్యేవారే ఎలక్టర్లు. వీరు డిసెంబరు 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లకుగాను... 270 మద్దతు లభించినవారు అధ్యక్షులవుతారు.
రాష్ట్రానికి ఇన్ని.. జనాభా ప్రాతిపదికన
అమెరికా 50 రాష్ట్రాల సమాహారం. వీటిలోని జనాభా ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ స్థానాలు ఉంటాయి. సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన కాలిఫోర్నియాకు అత్యధికంగా 54, భారతీయులు అధికంగా ఉండే టెక్సాస్ కు 40 ఎలక్టోరల్ సీట్లు ఉంటాయి. జనాభా తక్కువగా ఉండే వ్యోమింగ్ కు మూడు ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. పార్టీలు రాష్ట్రాల్లోని ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. నవంబరులో జరిగే పోలింగ్ ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ సీట్లు అనేది ఖరారవుతుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ వెళతాయి. కాలిఫోర్నియాలో కమలా కు సగం కంటే ఎక్కువగా 50.1 శాతం ఓట్లు (పాపులర్ ఓట్లు) వస్తే ఆ రాష్ట్రంలోని మొత్తం 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు డెమోక్రాటిక్ పార్టీ ఖాతాలో పడిపోతాయి. దీన్నిబట్టి స్పష్టం అయ్యేది ఏమంటే.. దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు వచ్చినా.. 270 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు వచ్చేలా ఓట్లు దక్కితేనే అధ్యక్ష పీఠంపై కూర్చోగలరు.
వీరు జస్ట్ మిస్ అధ్యక్షులు..
అమెరికా చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారని భావించిన హిల్లరీ క్లింటన్.. త్రుటిలో ఓటమిపాలయ్యారు. ప్రజల ఓట్లు ఎక్కువగా పడినప్పటికీ (పాపులర్ ఓటు).. ఎలక్టోరల్ కాలేజీలో దెబ్బతినడమే దీనికి కారణం. 1824లో తొలిసారి జాన్ క్విన్సీ ఆడమ్స్ కు, 2000 సంవత్సరంలో ఆల్ గోర్, 2016లో హిల్లరీ వీరి జాబితాలో ఉన్నారు. 2000లొ అల్ గోర్ కు జార్జ్ బుష్ కంటే 5లక్షల పైగా ఓట్లు అధికంగా వచ్చాయి. 2016లో ట్రంప్
కంటే హిల్లరీకి 30 లక్షల ఓట్లు ఎక్కువ పడ్డాయి. కానీ, ఎలక్టోరల్ కాలేజీకి అవసరమైనన్ని రాలేదు.
ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు.. తమ రాష్ట్రాల్లోని ఓటర్ల కోరికకు అనుగుణంగానే అధ్యక్ష ఎన్నికలో ఓటేయాలన్న రాజ్యాంగ నిబంధనేదీ లేదు. కాలిఫోర్నియాలో డెమోక్రాట్లకు దక్కిన 54 మంది ఎలక్టర్లంతా కమలాకే కచ్చితంగా ఓటు వేయాలని రూల్ లేదు. కానీ, నమ్మక ద్రోహానికి మాత్రం పాల్పడరు. నిర్దిష్ట పార్టీకే ఓటేస్తామని ముందే ప్రకటిస్తారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎవరైనా ‘విశ్వాసాన్ని’ వమ్ముచేస్తే వారిపై రాష్ట్రాలు కఠిన శిక్ష విధించాలని అమెరికా సుప్రీం కోర్టు 2020లో ఆదేశించింది.
200 ఏళ్ల కిందట టై..
అమెరికాలో టై కావడం అరుదు. అది కూడా 200 ఏళ్ కిందట జరిగింది. 1824లో నలుగురు అభ్యర్థులకూ ఎలక్టోరల్ కాలేజీలో సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడం కుదరలేదు. ఇలాంటప్పుడు కాంగ్రెస్‌లోని దిగువ సభ (ప్రతినిధుల సభ) అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఉపాధ్యక్షుడిని ఎగువ సభ (సెనెట్) ఎన్నుకుంటుంది.
అధ్యక్షుడి ఎన్నిక పాపులర్ ఓటు ద్వారానా? కాంగ్రెస్ (పార్లమెంటు) ద్వారానా? అనే సందిగ్ధం నడుమ.. మధ్యేమార్గంగా ఎలక్టోరల్ కాలేజీ పద్ధతి పుట్టింది. అన్ని రాష్ట్రాల, అమెరికా ప్రజల ప్రయోజనాల మధ్య సమతూకం కోసం ఆ దేశ రాజ్యాంగ నిర్మాతలు 1787లో ఎలక్టోరల్ కాలేజీకి శ్రీకారం చుట్టారు. దీనిని మార్చాలని, రద్దు చేయాలని 700సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదట.