ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఒంటరితనన్ని కోరుకుంటుందా?
"మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అనేది గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నినాదం.
By: Tupaki Desk | 14 Feb 2025 12:36 PM IST"మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అనేది గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నినాదం. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయానికి అది కూడా ఓ బలమైన కారణం అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ కోసం ట్రంప్ అనుసరిస్తున్న వ్యవహార శైలి.. అమెరికా మళ్లీ గ్రేట్ సంగతి అలా ఉంచితే.. ప్రపంచం ముందు ఒంటరైపోతోందా అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... అమెరికాను అగ్రరాజ్యం అని అంటారు.. అంతకంటే ముందు ప్రపంచానికి పెద్దన్న అంటారు. అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ఉన్న అమెరికా.. ప్రపంచానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది. అంత మాత్రాన్న అమెరికా పాడైపోయేది ఏమీ ఉండకపోవచ్చు. అయితే.. అమెరికాను మళ్లీ గ్రేట్ గా చేస్తానంటున్న ట్రంప్.. ప్రపంచ పెద్దన్నగా ఆ దేశం ఇంతకాలం పోషించిన పాత్రను వదిలేస్తున్నారు!
వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్) ప్రపంచంలోని పేద దేశాల్లో ప్రజారోగ్యం, వ్యవసాయం, మానవతా సహాయ ప్రాజెక్టులకు నిధులు ఇస్తుంటుంది. అయితే.. అది ఇప్పుడు గతం. ఇకపై అలాంటి సహాయ కార్యక్రమాలను నిధులు నిలిపివేయనున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) నుంచి అగ్రరాజ్యం బయటకు వచ్చేసిన పరిస్థితి.
ట్రంప్ ఈ నిర్ణయం వల్ల.. ప్రపంచ వ్యాప్తంగా క్షయ, ఎయిడ్స్, మలేరియా వంటి వాటి నివారణ, చికిత్సలు సమస్యల్లో పడతాయి. ఇదే సమయంలో.. భవిష్యత్తులో కరోనా వైరస్ లాంటి మహమ్మారులు తలెత్తినా.. వాటి విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు అలాంటి వాటిని ఎదుర్కొనే ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. ఇదే సమయంలో.. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి అమెరికా బయటకు వచ్చేసింది.
ఇలా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల అంతర్జాతీయ సేవలను 90 రోజుల పాటు నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో.. ఐక్యరాజ్యసమితి శరణార్థి సేవలకూ పెద్ద దెబ్బ తగిలినట్లయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా, ఆసియాలతో పాటు దక్షిణ అమెరికా ఖండాల్లో ఆరోగ్య సేవలు, తాగునీటి సరఫరా, స్వచ్ఛంద సంస్థలకు సాయం నిలిపేస్తే అక్కడ అమెరికా పలుకుబడి తగ్గిపోవడం ఖాయమని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పటికే ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో చైనా ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో.. 2023లో 130 దేశాలకు యూఎస్ ఎయిడ్ అందించిన 4,000 కోట్ల డాలర్లలో 1,600 కోట్లు ఒక్క యుక్రెయిన్ కే దక్కాయి. ఇప్పుడు ఆ సాయం కూడా అమెరికా వదిలేస్తే.. ఐరోపా దేశాలు అమెరికాకు దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇది చైనా, రష్యాలకు గుడ్ న్యూస్ అని చెబుతున్నారు.
ఇలా ప్రపంచ దేశాల విషయంలోనే కాకుండా.. స్వదేశంలోనూ ట్రంప్ నిర్ణయాలు సంచలనంగా మారుతుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులను సాగనంపడానికి ట్రంప్ ఏర్పాటు చేసిన డోజే విభాగం హల్ చల్ చేస్తోంది. మరోపక్క ఫెడరల్ ప్రభుత్వం.. అమెరికా ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు ఏటా ఇచ్చే రుణాలు గ్రాంట్లలో కొంతమేర నిలిపివేయాలని ట్రంప్ ఆదేశించారు.
ఈ విధంగా... ఇంటా, బయటా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా... ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా పొత్తులు దెబ్బతింటాయని.. చైనా, రష్యా వంటి దేశాలు సంబరాల్లో మునిగి తేలతాయని చెబుతున్నారు. మరి.. ప్రపంచ పెద్దన్న పాత్రను వదులుకునే క్రమంలో అమెరికా ఒంటరవుతోందా అనే చర్చ ఇప్పుడు నిపుణుల మధ్య మొదలైంది.