Begin typing your search above and press return to search.

సమితిలో సంచలనం.. ఉక్రెయిన్ పై రష్యాకు అమెరికా మద్దతు.. భారత్ గైర్హాజరు!

తాజాగా ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ.. సైన్యాన్ని వెంటనే ఉపసంహరించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది.

By:  Tupaki Desk   |   25 Feb 2025 11:53 AM GMT
సమితిలో సంచలనం.. ఉక్రెయిన్ పై రష్యాకు అమెరికా మద్దతు.. భారత్ గైర్హాజరు!
X

ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగాలు రష్యా నుంచి తిరిగొస్తాయని భావించొద్దు.. అంటూ ఇటీవలే అత్యంత దారుణ ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మూడేళ్లుగా యుద్ధాన్ని ఎగదోసి ఉక్రెయిన్ నిలువునా నష్టపోవడానికి కారణమైన దేశం అమెరికా. ఇప్పుడు మరోసారి గట్టి దెబ్బకొట్టింది. కీలకమైన ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ విషయంలో రష్యాకు మద్దతుగా అమెరికా ఓటేసింది.

ఇప్పటివరకు మూడేళ్ల యుద్ధంలో ప్రతి సందర్భంలోనూ ఉక్రెయిన్ కు మద్దతుగా ఐక్యరాజ్య సమితిలో ఓటు వేసింది అమెరికా. అలాంటి ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఒక్కసారిగా రూటు మార్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంటేనే కంపరమొత్తుతున్న ట్రంప్.. అవకాశం ఉన్న ప్రతిసారీ రష్యాతో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధం అవుతున్నారు. జెలెన్ స్కీని నియంత అని నిందించి.. పుతిన్ ను మాత్రం నియంత కాదని పేర్కొనే వరకు వెళ్లారు.

తాజాగా ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ.. సైన్యాన్ని వెంటనే ఉపసంహరించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. ఉక్రెయిన్‌ లో రష్యా దురాక్రమణను ఖండిస్తూ, ఆక్రమిత భూభాగాన్ని తిరిగి ఇవ్వాలని చేసిన తీర్మానాన్ని.. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్‌, ఉత్తర కొరియాతో పాటు వీటితో అనుబంధం ఉన్న14 దేశాలు ఖండించడం గమనార్హం. అయినా ఈ తీర్మానాన్ని యూఎస్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అనుకూలంగా 93, వ్యతిరేకంగా 18 ఓట్లు వచ్చాయి. 65 మంది గైర్హాజరయ్యారు. భారత్‌, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, ఇరాన్ కూడా ఓటింగ్‌ కు దూరంగా ఉన్నాయి దౌత్య సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో ట్రంప్‌ ఆలోచనకు మిత్ర దేశాలన్నీ సహకరించాయి.

ప్రాణ నష్టంపై మొసలి కన్నీరు..

ఉక్రెయిన్ లో జరిగిన ప్రాణ నష్టానికి సమితి జనరల్ అసెంబ్లీలో సంతాపం వ్యక్తం చేశారు. యుద్ధం ఆపివేసి.. చిరకాల శాంతి నెలకొనేలా చూడాలని సంక్షిప్త తీర్మానాన్ని అమెరికా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత.. యుద్ధానికి మూలాలనూ పరిష్కరించాలంటూ ఓ సవరణను రష్యా ప్రతిపాదించే యోచనలో ఉంది. అయితే, యుద్ధంపై ఈ మూడేళ్లలో చేసిన తీర్మానాలను అమలు చేయాలని ఉక్రెయిన్, ఈయూ పట్టుబడుతున్నాయి.

మొత్తమ్మీద ఎన్నడూ లేని విధంగా ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్‌ కు వ్యతిరేకంగా, రష్యాకు మద్దతుగా అమెరికా ఓటేయడం చరిత్రలో నిలిచిపోనుంది. ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాలనే ఈ తీర్మానానికి చాలా యూరప్ దేశాలు మద్దతు ప్రకటించాయి.