Begin typing your search above and press return to search.

ఉ.కొరియా సైనికుల శవాలు మూటలుగా వెళ్తాయి..అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

కాగా, ఉక్రెయిన్ యుద్ధంలో వేలాదిమంది సైనికులను కోల్పోయిన రష్యా.. ఇతర దేశాల వారిని సైనికులుగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Oct 2024 9:36 AM GMT
ఉ.కొరియా సైనికుల శవాలు మూటలుగా వెళ్తాయి..అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్
X

చూస్తూ ఉంటే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎక్కడికో వెళ్లేలా ఉంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. తమ వద్ద ఉన్న ఆయుధాలు అయిపోవడంతో రష్యా కాస్త మెత్తబడుతోంది. ఇక ఉక్రెయిన్ అమెరికా సహా నాటో దేశాల ఆయుధం సాయం కోసం ఎదురుచూస్తోంది. రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఎవరికీ శాంతి లేదు. ఎవరూ ఏమీ సాధించింది లేదు. కాగా, ఉక్రెయిన్ యుద్ధంలో వేలాదిమంది సైనికులను కోల్పోయిన రష్యా.. ఇతర దేశాల వారిని సైనికులుగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే.

అప్పుడు భారత్.. ఇప్పుడు ఉ.కొరియా

ఉద్యోగాల కోసం అంటూ తీసుకెళ్లిన భారత యువతను ఉక్రెయిన్ పై యుద్ధంలో సైనికులుగా వాడుకుంటున్న రష్యా తీరు ఆ మధ్య బయటపడింది. ఇలానే రష్యాకు ఆప్త మిత్రడైన ఉత్తర కొరియా సైనికులు ఇప్పుడు ఉక్రెయిన్ గడ్డపై కాలుమోపనున్నారు. ఈ విషయం గతంలోనే తెలిసినా.. తాజాగా కన్ఫార్మ్ అయింది. మొత్తం 10 వేలమంది ఉత్తర కొరియా సేనలను రష్యా తరలిస్తున్నట్లు చెబుతున్నారు. ఉ.కొరియా దాయాది అయిన దక్షిణ కొరియా కూడా ఇదే ఆరోపణ చేసింది.

కిమ్.. వెళ్లేది శవాలుగానే..

రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌ వెళ్తే తిరిగి రావడం ఉండదంటూ అమెరికా హెచ్చరించింది. తెలుగు సినిమా డైలాగ్ తరహాలో.. ఉత్తర కొరియా సైనికుల శవాలు బ్యాగ్‌ లలో తిరిగివెళ్తాయంటూ మండిపడింది. కాబట్టి ఉక్రెయిన్ లోకి దిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏకంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేరును ప్రస్తావిస్తూ ఐక్యరాజ్యసమితిలోని అమెరికా డిప్యూటీ అంబాసిడర్‌ రాబర్డ్‌ వుడ్‌ హెచ్చరించారు. ఒకటి, రెండుసార్లు ఆలోచించుకోవాలని కూడా సూచించారు.

ఐక్యరాజ్య సమితిలో వాగ్వాదం

ఉత్తర కొరియా బలగాలను ఉక్రెయిన్ కు పంపడపై సమితిలో వాగ్వాదం చెలరేగింది. నాటో కూటమిలోని దేశాలు ఉక్రెయిన్ కు సాయం చేయగా లేనిది.. తమకు ఉత్తర కొరియా సాయం చేస్తే తప్పేమిటని సమితిలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా నిలదీశారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించబోమని స్పష్టం చేశారు. తాము ఉత్తర కొరియా సాయం పొందుతున్నది నిజమే అయినా.. ఉక్రెయిన్‌ పై యుద్ధం మొదలైన 2022 నుంచి మాత్రం కాదన్నారు. అయితే, రష్యా ఆరోపణలపై ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిట్యా స్పందిస్తూ.. ఉక్రెయిన్‌ కు సాయం అందించే దేశాలు భద్రతామండలి ఆంక్షలను ఉల్లంఘించడం లేదని పేర్కొన్నారు.

కొసమెరుపు: ఉక్రెయిన్ కు దళాలను పంపుతున్నట్లు ఉత్తర కొరియా ఇప్పటివరకు అంగీకరించలేదు. అలాంటి చర్య తీసుకుంటే.. అది అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉంటుందని మాత్రం పేర్కొంది. అమెరికా సహా పశ్చిమ దేశాలు రష్యా సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలు బహిర్గతం చేయడం, బెదిరింపులకు పాల్పడడం చేపడితే.. తగిన సమాధానం ఇస్తాం అని పేర్కొంది. భద్రత, అభివృద్ధిపై రష్యాతో తాము సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నట్లు ఐరాసలో ఉత్తర కొరియా రాయబారి సాంగ్‌ కిమ్‌ కౌన్సిల్‌ పేర్కొన్నారు.