అమెరికా వీధుల్లో బెంగళూరు దోశ, ఇడ్లీ... స్పెషాలిటీ ఇదే!
అవును... బెంగళూరుకు చెందిన వెంకట్ రాజు న్యాయవాదిగా.. అతని భార్య శ్వేత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అగ్రరాజ్యంలో పనిచేస్తున్నారు.
By: Tupaki Desk | 10 Oct 2023 2:09 PM GMTసాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ.. దానిపై కాస్త కారం పొడి, లైట్ గా నెయ్యి ఉంటే చాలని చాలామంది భావిస్తుంటారు. మరిముఖ్యంగా దక్షిణాది ప్రజల సంగతి అయితే చెప్పేపనిలేదు. ఉదయన్నే పొగలు కక్కుతున్న ఇడ్లీ, అప్పుడే పెనంపై నుంచి తీసిన దోశలను ఊదుకుంటూ ఊదుకుంటూ తింటే ఆ రోజంతా ఫ్రెష్ గా ఉంటుందని భావిస్తుంటారు.
దక్షిణాదిలో ఉంటే సరే... తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఇక చెప్పే పనే లేదు. మరి అమెరికాలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? అక్కడ కూడా అక్కడక్కడా ఇండియన్ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా అంటారా.. ఆ మాట వాస్తవమే! అయితే అదే స్టైల్లో సేంద్రియ పద్ధతిలో పండించిన పప్పులనే వాడుతూ వ్యాపారంగా కాకుండా.. సంతోషకరమైన వ్యాపకంగా ఇడ్లీ, దోశ అమ్ముతున్నారు బెంగళూరుకు చెందిన దంపతులు!
అవును... బెంగళూరుకు చెందిన వెంకట్ రాజు న్యాయవాదిగా.. అతని భార్య శ్వేత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అగ్రరాజ్యంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ 2016 లో ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. అయితే అక్కడ వీరికి బ్రేక్ ఫాస్ట్ లో అప్పుడప్పుడూ అయినా ఇడ్లీ, దోశ తినాలని ఉండేదంట. అయితే ఆ టేస్ట్ ఫుడ్ దొరక్క నిరాసగా ఉండేవారంట.
ఈ క్రమంలో ఒకసారి సేవా కార్యక్రమంలో భాగంగా వాళ్ల పాప నిమ్మరసం స్టాల్ పెట్టింది. ఫలితంగా వచ్చిన డబ్బులను విరాళంగా ఇచ్చింది. అది చూసిన శ్వేత దంపతులు... భారతీయ రుచులను మనమే ఎందుకు అందించకూడదనే ఆలోచన చేశారంట. దీంతో... 2021లో అమెరికా వీధిలో “బ్రూక్లిన్ కర్రీ ప్రాజెక్ట్” ప్రారంభమైంది.
ప్రతీ శనివారం మాత్రమే బ్రూక్లిన్ వీధిలో తెరుచుకునే ఈ ఫుడ్ స్టాల్ లో ఇడ్లీ, రకరకాల దోశలు, కిచిడీ, ఊతప్పం.. వంటి సూపర్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ అందుబాటులో ఉంటుంది. దీనికోసం సేంద్రియ పద్ధతిలో పండించిన పప్పులు, మసాలాలు, నెయ్యి వంటివి భారత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు శ్వేత!
ఇలా ప్రతీ శనివారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తెరుచుకునే ఈ ఫుడ్ స్టాల్... ఉన్న సరకు పూర్తయ్యేంత వరకూ తెరచి ఉంటుంది. ఈ సమయంలో స్టాల్ ఎప్పుడు తెరుస్తారా అన్నట్లుగా చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది ఎదురు చూస్తోంటే చాలా ఆనందంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇలా తన ఇండ్లీ, దోశ మొదలైన అల్పాహారాలు తిన్నావారు ఎక్కడెక్కడి నుంచో వచ్చినవాళ్లు అమ్మ చేతి వంట గుర్తొచ్చిందని చెబుతుంటే జాబ్ సాటిస్ ఫ్యాక్షన్ మామూలుగా ఉండదని ఈ దంపతులు చెబుతున్నారు. ఇదే సమయంలో... ఇది తమకు వ్యాపారం కాదని.. సంతోషకరమైన వ్యాపకం మాత్రమే అని చెబుతున్న ఈ దంపతులు... త్వరలో దక్షిణ భారత సంప్రదాయ వంటకాలతో ఓ రెస్టారెంట్ నీ ప్రారంభించనున్నారని చెబుతున్నారు!!