అమెరికా కళాశాలల్లోకి ఇజ్రాయెల్- హమాస్ చిచ్చు!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదంపై అమెరికా కళాశాల క్యాంపస్ లలో తీవ్ర చర్చ కొనసాగుతోంది
By: Tupaki Desk | 17 Oct 2023 7:26 AM GMTఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం తాలూకూ ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవి అగ్రరాజ్యం అమెరికా యూనివర్సిటీలు, కళాశాలల్లోకి వ్యాపించాయి. ఇజ్రాయెల్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా క్యాంపస్ లు చీలిపోయాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదంపై అమెరికా కళాశాల క్యాంపస్ లలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ – హమాస్ ల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో సందేశాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి, యువ అమెరికన్లు ఈ అంశంపై చర్చించడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఇరువైపులా అమెరికాలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. గత వారం న్యూయార్క్ నగరంలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో వందలాది మంది విద్యార్థులు ఇజ్రాయెల్ పై హమాస్ దాడులను ఖండిస్తూ నిరసన తెలిపారు,
అమెరికాలోని ఇజ్రాయెల్ అనుకూలురుల్లో ఎక్కువ మంది యూదులే ఉన్నారు. వీరు తెలుపు, నీలం ఇజ్రాయెల్ జెండాలు ధరించారు. వీరు ఇజ్రాయెల్ కు అనుకూలంగా మౌన ప్రదర్శన నిర్వహించారు. హమాస్ యొక్క ఘోరమైన దాడిలో మరణించిన బాధితుల ఫోటోలతో ప్రధాన కూడళ్లలో ప్రదర్శనలు చేపట్టారు.
మరోవైపు పాలస్తీనియన్లకు మద్దతు తెలిపిన విద్యార్థులు 'స్వేచ్ఛ పాలస్తీనా', 'ఆక్రమణల నుంచి వెనక్కి వెళ్లండి' అని ప్రకటించే సంకేతాలను చూపారు. గాజాకు చెందిన ఒక మహిళా విద్యార్థి ఇజ్రాయెల్ దిగ్బంధనంలో చిక్కుకున్న తన తల్లి గురించి మాట్లాడింది.
అటు ఇజ్రాయెల్ కు మద్దతు పలుకుతున్నవారు, ఇటు పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నవారు ఒకరికొకరు కొంచెం దూరంలోనే ఈ ప్రదర్శనలను చేపట్టడం గమనార్హం. కానీ వారి మధ్య సైద్ధాంతిక దూరం మాత్రం చాలా పెద్దదిగా కనిపించింది.
హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్ తోపాటు అనేక ఇజ్రాయెల్ పట్టణాలలో ఒక సంగీత ఉత్సవంపై దాడి చేసి కనీసం 1,400 మందిని చంపి 150 మందిని బందీలుగా తీసుకున్న ఒక రోజు తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో రెండు విద్యార్థి సంఘాలు ఇజ్రాయెల్, పాలస్తీనాలకు అనుకూలంగా నిరసన ర్యాలీలు చేపట్టాయి.
ర్యాలీలో చాలా మంది విద్యార్థులు మీడియాతో మాట్లాడలేదు. అయితే 2016లో కొలంబియా యూనివర్సిటీ నుండి పట్టభద్రుడై, పాలస్తీనా అనుకూల నిరసనకారులకు మద్దతుగా వచ్చిన దరియాలిజా అవిలా చెవిలియర్ అనే వ్యక్తి ఇలా అన్నారు... 'ఎవరూ హింసను కోరుకోరు. మేము చెప్పేది ఏమిటంటే, న్యాయం జరిగినప్పుడే హింస ముగుస్తుంది.. ప్రజలు తమ జీవితాలను తాము జీవించగలరు'
ఈ ర్యాలీలో పాల్గొన్న పలువురు వక్తలు పౌరుల ప్రాణాలను కోల్పోవడాన్ని ఖండించారు. హత్యకు గురైన వారికి గౌరవసూచకంగా కొద్దిసేపు మౌనం పాటించారు. కానీ వారు హింసకు గురైన ఇజ్రాయెల్ బాధితుల గురించి లేదా అనేక మంది మహిళలు, పిల్లలతో సహా ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ చేసిన దురాగతాల గురించి నిర్దిష్టంగా ప్రస్తావించలేదు.
స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా.. తాము అమాయక పౌరులపై ఇలాంటి హింసాకాండను వ్యతిరేకిస్తామని తెలిపారు. 'జీవితం, న్యాయ పరిరక్షణ కోసం మాత్రమే నిలబడతామని బీబీసీకి తెలిపారు.
ఇజ్రాయెల్ – హమాస్ కు సంబంధించి విద్యార్థుల మధ్య రాజకీయ విభజనలో కొలంబియా విశ్వవిద్యాలయం ఒక్కటే కాదు. హార్వర్డ్ యూనివర్శిటీలోని విద్యార్థి సంఘాలు కూడా ఇజ్రాయెల్ విధానాలే తమ పౌరుల ఊచకోతకు కారణమని ఒక ప్రకటన విడుదల చేశాయి.