అమెరికాలో కాల్పులు.. ఆ బిల్లు ఆమోదానికి సపోర్ట్ ప్లీజ్!
అమెరికాలో రోజు రోజుకీ పెరిగిపోతున్న గన్ కల్చర్ వల్ల ప్రజల భద్రత, ప్రశాంతత ప్రశ్నార్ధకంగా మారుతుందనే విమర్శలు ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్నాయి
By: Tupaki Desk | 27 Oct 2023 4:11 AM GMTఅమెరికాలో రోజు రోజుకీ పెరిగిపోతున్న గన్ కల్చర్ వల్ల ప్రజల భద్రత, ప్రశాంతత ప్రశ్నార్ధకంగా మారుతుందనే విమర్శలు ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్నాయి. సగటున వారంలో ఒకటి రెండు చోట్ల కాల్పులకు సంబంధించిన వార్తలు దర్శనమిస్తున్నాయి. దీంతో బయటప్రపంచానికి తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఒక బిల్లు చర్చకు వస్తుంది.
అవును... అమెరికాలో రోజు రోజికీ పెరుగుతున్న గన్ కల్చర్ పై చర్చ జరుగుతుండి. ఈ సమయంలో 1994నాటి బిల్లుకు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తుంది. కారణం... తాజాగా జరిగిన సామూహిక కాల్పుల ఘటన కూడా! మైనేలో ఓ దుండగుడు జరిపిన కాల్పులు ఇప్పుడు అమెరికాలో ఈ కొత్త చర్చకు తెరలేపాయి. పైగా కడుపులో మంది, బుర్రలో మత్తు ఉన్న సమయంలో చేతిలో గన్ ఉండేసరికి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయని అంటున్నారు.
తాజాగా మైనేలో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన సామూహిక కాల్పుల్లో సుమారు 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 60 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. లెవిస్టన్ లో జరిగిన ఈ కాల్పుల ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఈ సందర్భంగా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగా.. గతంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు సెమీ ఆటోమెటిక్ రైఫిల్ తో కాల్పులు జరిపినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. అమెరికా మొత్తాన్ని ఉలిక్కిపడేట్టు చేసిన ఈ ఘటనపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయుధాన నిషేధ చట్టం ప్రస్థావన తీసుకొచ్చారు.
అవును... మైనేలో జరిగిన వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రమాదకర ఆయుధాలపై నిషేధం విధించడం మంచిదని, దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించడానికి రిపబ్లికన్ పార్టీ నేతలు సహకరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోరారు. ఇందులో భాగంగా... అసల్ట్ వెపన్ బ్యాన్ బిల్లును తెరపైకి తెచ్చారు.
ఈ నేపథ్యంలో అమెరికన్ ప్రజలను రక్షించే బాధ్యతను నెరవేర్చాలని కాంగ్రెస్ లోని రిపబ్లికన్ సభ్యులను కోరుతున్నట్లు చెప్పిన బైడెన్... ఇప్పటికైనా ప్రమాదకర ఆయుధాలు, అధిక సామర్థ్యం గల మ్యాగజైన్ లపై నిషేధం బిల్లును ఆమోదించడానికి తమకు సహకరించండని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా... అమెరికా ప్రజల భద్రత దృష్ట్యా అక్కడి కాంగ్రెస్ 1994లో పదేళ్ల కాలవ్యవధితో ఫెడరల్ అసల్ట్ వెపన్ బ్యాన్ (ప్రమాదకర ఆయుధాల నిషేధం) చట్టాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. 2004 తర్వాత ఈ చట్టాన్ని మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అది కార్యరూపం మాత్రం దాల్చలేదు.
ఈ క్రమంలో తాజాగా మైనే కాల్పుల ఘటన అమెరికాను ఒక్కసారిగా ఉలిక్కిపడిన నేపథ్యంలో బైడెన్ ఈ బిల్లు ప్రస్తావన తీసుకొచ్చారు. మరి ఈ బిల్లు, బైడెన్ అభ్యర్థనపై రిపబ్లికన్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి!