Begin typing your search above and press return to search.

అమెరికాలో ఇల్లు.. అమ్మో అనాల్సిందే

మరోవైపు సొంత ఇల్లు అన్నది గౌరవ సూచికగా భావిస్తారు. కానీ ఇప్పుడు అమెరికాలో ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా మధ్య తరగతి ప్రజలకు కష్టంగా మారింది

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:50 PM GMT
అమెరికాలో ఇల్లు.. అమ్మో అనాల్సిందే
X

సొంత ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదు. అది భారత్ అయినా అమెరికా అయినా ఒకటే. కానీ ఇప్పుడు అమెరికాలోని మధ్య తరగతి జనాలు ఇల్లు కొనాలంటే అమ్మో అనాల్సిందే. ఎందుకంటే హౌస్ లోన్ పై వడ్డీ రేటు ఆకాశాన్ని తాకడమే అందుకు కారణం. ముఖ్యంగా న్యూ జెర్సీ, న్యూయార్క్ సిటీ లాంటి అర్బన్ ఏరియాల్లో ఈ వడ్డీ రేటు మరింత ఎక్కువగా ఉంది. దీని కారణంగా చాలా మంది అమెరికన్లు సొంత ఇల్లు సొంతం చేసుకోలేకపోతున్నారు.

మరోవైపు సొంత ఇల్లు అన్నది గౌరవ సూచికగా భావిస్తారు. కానీ ఇప్పుడు అమెరికాలో ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా మధ్య తరగతి ప్రజలకు కష్టంగా మారింది. వడ్డీ రేట్లు పెరగడం, అప్పుపై అధిక వడ్డీ చెల్లించాల్సి రావడం తదితర కారణాలతో సొంత ఇంటి కలకు చాలా మంది దూరంగానే ఆగిపోతున్నారని తెలిసింది. గత పదేళ్లలో ఇంటి విలువ 58 శాతం పెరిగింది. అయితే రియల్ ఎస్టేట్ రంగం మాత్రం ఇప్పటికీ మెరుగ్గానే సాగుతోంది. కొంతమంది అమెరికన్ల ఆదాయం పెరగడంతో ఇంటిపై పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతుండటమే అందుకు కారణం.

2022లో అమెరికా హౌస్ ఓనర్ల నెట్ విలువ 3,96,200 అమెరికా డాలర్లుగా ఉంది. అద్దెకు ఉన్నవాళ్ల (10,400 డాలర్లు) కంటే అది 40 శాతం ఎక్కువ. కానీ ఇప్పుడు 75 శాతం కంటే ఎక్కువ ఇల్లు మధ్య తరగతి వాళ్లకు అందనంత ఖరీదుగా మారాయి. అందుకే ఈ ఏడాది సెప్టెంబర్ లో గత 13 ఏళ్ల కంటే కనిష్ఠ స్థాయిలో ఇళ్ల కొనుగోల్లు జరిగాయి. ఇప్పుడు ఇల్లు కొనేందుకు సరైన సమయం కాదని 85 శాతం ప్రజలు అనుకుంటున్నారని తెలిసింది. మరోవైపు ధనవంతులు, మధ్య తరగతి ప్రజల మధ్య ఆదాయ వ్యత్యాసాలు కూడా అధికంగా ఉండటం ఇందుకు ఓ కారణమని తెలిసింది.