Begin typing your search above and press return to search.

అమెరికా ఏరోజుకారోజు అప్పులతోనే.. ఎందుకీ దుస్థితి!

మార్చి 1 నాటికి నిధులు విడుదల కాకపోతే ఆ దేశంలో పలు ప్రభుత్వ విభాగాల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 March 2024 5:50 AM GMT
అమెరికా ఏరోజుకారోజు అప్పులతోనే.. ఎందుకీ దుస్థితి!
X

అగ్ర రాజ్యం, ప్రపంచ దేశాలకు పెద్దన్నగా అమెరికాను అంతా భావిస్తుంటారు. అలాంటి దేశ ప్రభుత్వం ఇప్పుడు దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు బండి లాగిస్తోంది. మార్చి 1 నాటికి నిధులు విడుదల కాకపోతే ఆ దేశంలో పలు ప్రభుత్వ విభాగాల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా అనేకమంది ప్రభుత్వ సిబ్బందిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెబుతున్నారు.

ఈ దుస్థితిని నివారించడానికి తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నామని అమెరికా పార్లమెంటు అయిన కాంగ్రెస్‌ ఉభయసభల నాయకులు ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండటానికి కొన్ని నిధులు విడుదల అవుతాయని పార్లమెంటులో దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ రిప్రంజెంటేటివ్స్‌ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ వెల్లడించారు.

గత ఐదు నెలల్లో ఇలా హడావిడి నిధులతో ప్రభుత్వం నడవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్చి 8కి ముందు వ్యవసాయ, రవాణా, హోం శాఖల బిల్లులను, మార్చి 22న రక్షణ, విదేశాంగ తదితర శాఖల బిల్లులను ఆమోదించి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ∙కుప్పకూలకుండా చర్యలు చేపట్టనున్నారు.

కాగా దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ లో అధికారంలో ఉన్న డెమోక్రాట్ల కంటే ప్రతిపక్ష రిపబ్లికన్లకే మెజారిటీ ఉంది. డెమోక్రాట్లకు ఎగువ సభ అయిన సెనెట్‌ లో మెజారిటీ ఉంది. అయితే ఈ మెజారిటీ స్వల్పమే. దీంతో దిగువ సభలో రిపబ్లికన్లు ముఖ్యమైన బిల్లులు పాస్‌ కాకుండా అడ్డుకోగలుగుతున్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇతర మిత్రదేశాలకు అత్యవసర సాయానికి ఉద్దేశించిన 9,500 కోట్ల డాలర్ల బిల్లుకు కూడా ఇంతవరకు మోక్షం లభించలేదు.

ఈ నేపథ్యంలో సెనేట్‌ ఫిబ్రవరి 29న ప్రభుత్వ నిధుల తాత్కాలిక పొడిగింపు బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును అమెరికా అధ్యక్షుడి ఆమోదానికి పంపింది. కొన్ని ప్రభుత్వ సంస్థలకు మార్చి 8 వరకు, మరికొన్నిటికి మార్చి 22 వరకు నిధులు సమకూర్చే స్వల్పకాలిక పొడిగింపును ఆమోదించింది. ఈ మేరకు సెనెట్‌ బిల్లును ఆమోదించింది. చట్టంపై సంతకం చేస్తానని అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు.