బెంగళూరులో అమెరికా కాన్సులేట్.. క్రెడిట్ కోసం పోరు షురూ
తమ వల్లే కాన్సులేట్ కల సాకారమైందన్న మాటను ఎవరికి వారు చెప్పుసుకుంటూ.. వైరి పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
By: Tupaki Desk | 18 Jan 2025 5:03 AM GMTదశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న కన్నడిగుల కోరిక తీరింది. గార్డెన్ సిటీ బెంగళూరులో అమెరికా కాన్సులేట్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇప్పటివరకు అమెరికా వీసా కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన తిప్పలు తప్పుతాయన్న ఆనందం ప్రజల్లో ఉంటే.. రాజకీయ పార్టీల మధ్య మాత్రం కాన్సులేట్ క్రెడిట్ కోసం పోరు మొదలైంది. తమ వల్లే కాన్సులేట్ కల సాకారమైందన్న మాటను ఎవరికి వారు చెప్పుసుకుంటూ.. వైరి పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం.. కేంద్రంలో బీజేపీ నేత్రత్వంలోని ఎన్డీయే పవర్ లో ఉండటం తెలిసిందే. అమెరికా కాన్సులేట్ ప్రారంభ సమయంలో ఆసక్తికర సీన్ తెర మీదకు వచ్చింది. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియెట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో బారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కాన్సులేట్ ప్రారంభాన్ని ప్రకటించారు.
కర్ణాటకతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడగా.. డిప్యూటీ సీఎం శివకుమార్ మాట్లాడుతూ.. ఎస్ఎం క్రిష్ణ ముఖ్యమంత్రిగా.. విదేశాంగ శాఖ మంత్రిగా వ్యవహరించినప్పటి నుంచి అమెరికా కాన్సులేట్ కార్యాలయం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆ టైంలో ఆయనతో పాటు తాను కూడా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీఎంపీ తేజస్వీ సూర్య మరోలా స్పందించారు.
బెంగళూరులో అమెరికా కాన్సులేట్ కోసం గతంలో ఎందరో ప్రయత్నం చేసినా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ లు స్వయంగా జోక్యం చేసుకున్న తర్వాతే కాన్సులేట్ మార్గం సుగమమైందంటూ ఎదురుదాడికి దిగారు. ఆటలో అరటిపండు మాదిరి.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అమెరికా రాయబారితో మాట్లాడినట్లుగామాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోషల్ మీడియాలో పేర్కొంటూ.. మైలేజీలో భాగం కోసం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోల్ని షేర్ చేసుకోవటం గమనార్హం. మొత్తంగా.. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. బెంగళూరుకు అమెరికా కాన్సులేట్ రావటానికి 24 ఏళ్లు పట్టిందన్న విషయాన్ని చూసినప్పుడు.. మైలేజీ విషయంలో అందరికి వాటా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాలి.