Begin typing your search above and press return to search.

ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నట్లే ఉంది : యూఎస్ మహిళ వీడియో వైరల్

ట్రంప్ వచ్చాక.. ఇమిగ్రేషన్ ను టైట్ చేశాక అందరి అమెరికా కలలు కల్లలవుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 March 2025 4:00 PM IST
ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నట్లే ఉంది : యూఎస్ మహిళ వీడియో వైరల్
X

ట్రంప్ వచ్చాక.. ఇమిగ్రేషన్ ను టైట్ చేశాక అందరి అమెరికా కలలు కల్లలవుతున్నాయి. దాంతోపాటు అమెరికాలో భారతీయుల వరుస మరణాలు, కాల్పుల దురగతాలు కూడా అమెరికా కంటే మన బిడ్డలకు ఇండియానే బెస్ట్ అని అందరినీ ఆలోచింపచేస్తోంది. అగ్రరాజ్యం అయినా కూడా అన్ని అవస్థల మధ్య అక్కడ బతుకీడ్చడం కంటే ఇండియాలో దర్జాగా బతకడం బెటర్ అన్న ఆలోచన ప్రవాస భారతీయుల్లో నెలకొంది. అందుకే ఇప్పుడు అందరూ ఇండియాకు తిరిగి వచ్చేయాలా? అన్న ఆలోచనలో పడిపోయారు. ఇండియా వాళ్లే కాదు.. అమెరికన్స్ కూడా వారి దేశం కంటే భారత్ నే బెటర్ అంటూ కితాబిస్తుండడం విశేషం.

భారత్ ఆధునికతలో అమెరికా కంటే ముందుంది అంటూ ఓ అమెరికన్ మహిళ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎంతో మంది యూఎస్‌లో జీవించాలని కలలు కంటారు, కానీ భారత్ పలు అంశాల్లో అమెరికా కంటే మెరుగైనదని ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ ఈ విషయాలను సోషల్ మీడియాలో వీడియో రూపంలో షేర్ చేయగా, ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

-యూపీఐ నుంచి రిక్షాల వరకు.. భారతీయ రవాణా, చెల్లింపుల సౌకర్యం

క్రిస్టెన్ ఫిషర్ మాట్లాడుతూ భారతదేశంలోని డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఆచరణలోకి రావాలనిపించిందని తెలిపారు. ఇక్కడ యూపీఐ చెల్లింపులు అత్యంత వేగంగా సులభంగా ఉంటాయని, తాను ఎక్కడికైనా ఫోన్ మాత్రమే తీసుకెళ్లి అన్ని చెల్లింపులూ చేయగలుగుతున్నానని పేర్కొన్నారు.

అలాగే భారతదేశంలోని ఆటోలు, రిక్షాలు ఆమెకు ఎంతో ఇష్టమని, ఇవి చవకైన రవాణా ఎంపికలని, అమెరికాలో ఇలాంటి సౌకర్యాలు లేవని అన్నారు. భారత్‌లో వీటి వినియోగం వల్ల ప్రజలకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణ అవకాశం ఉంటుందని వివరించారు.

-భారత వైద్య సేవలు.. అమెరికా కంటే మెరుగైనవే?

భారతదేశంలో మరో గొప్ప విషయం వైద్య సేవలు అని క్రిస్టెన్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ డాక్టర్లు సులభంగా అందుబాటులో ఉంటారని, కొన్నిసార్లు అపాయింట్‌మెంట్ లేకుండానే వైద్యం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. అమెరికాతో పోల్చుకుంటే, ఇక్కడ చికిత్స పొందడం తేలికని అభిప్రాయపడ్డారు.

-డెలివరీ సర్వీసులు, ధర నియంత్రణ & చెత్త నిర్వహణ

భారతదేశంలోని ఆన్‌లైన్ డెలివరీ సర్వీసులు ఎంతో వేగంగా, అందుబాటులో ఉంటాయని, అమెరికాలో అలాంటి సౌకర్యాలు లేవని క్రిస్టెన్ అన్నారు. అలాగే భారత్‌లో MRP (గరిష్ట రిటైల్ ధర) వ్యవస్థ ఉండటం వల్ల, వినియోగదారులకు మోసం జరగకుండా రక్షణ కలుగుతుందని తెలిపారు. భారతదేశంలో ప్రభుత్వ చెత్త తొలగింపు సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి, అయితే అమెరికాలో దీని కోసం ప్రజలు భారీగా చెల్లించాల్సి వస్తుందని వివరించారు.

-సోషల్ మీడియాలో వైరల్ – మిశ్రమ స్పందనలు

క్రిస్టెన్ ఫిషర్ పెట్టిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది. కొంత మంది ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను, పెద్ద సమస్యలను గుర్తుచేస్తున్నారు.