ఏఐ డీప్ ఫేక్ ఎఫెక్ట్.. వాయిస్ రోబో కాల్స్‌పై అమెరికా నిషేధం!
కొందరు సైబర్ నేరగాళ్లు.. ఈ డీప్ ఫేక్ వాయిస్ ను సృష్టించినట్టు గుర్తించారు.
By: Tupaki Desk | 12 Feb 2024 4:33 PM GMTకృత్రిమ మేధ ఆధారంగా సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు.. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ ప్రధాని నరేంద్ర మోడీ సహా.. పలువురు సినీ అగ్రతారలకు సంబంధించి డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు.. కొన్నాళ్ల కిందట తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు తాజాగా ఇదే వ్యవహారం అగ్రరాజ్యం అమెరికాలోనూ కలకలం రేపుతోంది. ఏకంగా అధ్యక్షుడు జో బైడెన్ వాయిస్‌ను అనుకరిస్తూ.. సృష్టించిన `డీప్ ఫేక్` దేశంలో తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు సైబర్ నేరగాళ్లు.. ఈ డీప్ ఫేక్ వాయిస్ ను సృష్టించినట్టు గుర్తించారు. దీంతో అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రోబో కాల్స్‌పై నిషేధం విధించారు.
ఏం జరిగింది?
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను అనుకరిస్తూ నకిలీ రోబోకాల్స్ వైరల్ అయింది. న్యూ హ్యాంప్‌షైర్ ప్రావిన్స్‌లో జరిగిన డెమోక్రాట్ ప్రైమరీ ఎన్నికల సమయంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేయొద్దని బైడెన్ చెప్పినట్లు అందులో పేర్కొనడంతో రాజకీయంగా ఇది దుమారం రేపింది. ఏకంగా బైడెన్ ఇలా పిలుపునిచ్చారా? అనే చర్చ కూడా కొనసాగింది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఏఐ ఆధారిత రోబోకాల్స్‌పై నిషేధం విధిస్తున్నట్టు అధ్యక్ష భవనం తెలిపింది. అంతేకాదు.. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు వెల్లడించారు. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలను కంపెనీలు సృష్టించినా, ప్రసారం చేసినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
గుర్తించడం కనా కష్టం!
ప్రస్తుతం ఉన్న ఏఐ సాంకేతికత కారణంగా.. నకిలీలను గుర్తించడం కూడా కష్టంగా మారిందని.. అమెరికా ఏజెన్సీలు చెబుతున్నాయి. ‘‘కొంతమంది నేరగాళ్లు ఏఐని ఉపయోగించి నకిలీ వాయిస్ రోబోకాల్స్‌ను సృష్టిస్తున్నారు. వాటితో ప్రముఖుల కుటుంబాలను బెదిరించడం, సెలబ్రిటీలను ఇమిటేట్ చేసి తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతున్నారు. అధునాతన సాంకేతికతతో ఈ నకిలీలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో ఇలాంటి ఫేక్ రోబోకాల్స్ కొత్త ముప్పును తెచ్చిపెడుతున్నాయి’’ అని ఎఫ్‌సీసీ కమిషనర్ జియోఫ్రే స్టార్క్స్ తెలడం గమనార్హం.