Begin typing your search above and press return to search.

ఈ దుర్గమ్మ చాలా రిచ్ గురూ... లక్షా 25వేల అమెరికన్ వజ్రాలతో విగ్రహం!

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ దుర్గామాత విగ్రహాల్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు భక్తులు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 4:07 AM GMT
ఈ దుర్గమ్మ చాలా రిచ్ గురూ... లక్షా 25వేల అమెరికన్ వజ్రాలతో విగ్రహం!
X

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ దుర్గామాత విగ్రహాల్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు భక్తులు. ఇందులో భాగంగా రాజస్థాన్ లో కూడా ఓ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఇది సాధారణ విగ్రహం కాదు.. డైమండ్స్ తో పొదగబడిన విగ్రహం. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

అవును... రాజస్థాన్ రాష్ట్రంలోని చురుస్ సత్సంగ్ భవన్‌ లోని దుర్గా ఆస్థానాన్ని అలంకరించిన పండిట్ బల్ముకుంద్ వ్యాస్, సింహంపై స్వారీ చేస్తున్న "అష్టభుజ దుర్గ" విగ్రహం ఏర్పాటు చేశారు. సుమారు తొమ్మిదిన్నర అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల వెడల్పు ఈ దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంలో అత్యంత విలువైన ప్రత్యేకత ఉంది.

బెంగాల్ కు చెందిన 10 మంది కళాకారులు ఏకథాటిగా 3 నెలల పాటు శ్రమించి, ఈ అష్టభుజ విగ్రహాన్ని తయారుచేశారని చెబుతున్నారు. విగ్రహం తయారీకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టిని ఉపయోగించారని బల్ముకుంద్ వ్యాస్ తెలిపారు. అందులో ప్రత్యేకత ఏముంది అనుకునే లోపు ఒక అద్భుతమైన విషయం వెల్లడించారు.

అందులో భాగంగా... ఈ విగ్రహంపై అక్షరాలా లక్షా 25వేల అమెరికన్ వజ్రాల్ని పొదిగారు. దీంతో... ఈ ఏడాది ఏర్పాటుచేసిన విగ్రహాల్లో అత్యంత ఖరీదైన విగ్రహంగా ఇది రికార్డ్ సృష్టించింది!

ఈ విషయంపై మరిన్ని వివరాలు చెప్పిన పండిట్ బల్ముకుంద్ వ్యాస్... దీని కోసం ప్రత్యేకంగా అమెరికాలో పర్యటించినట్లు చెబుతున్నారు. చికాగో వెళ్లి, 9 రంగుల్లో మెరిసే రకరకాల వజ్రాల్ని పరిశోధించి, కొనుగోలు చేసి వచ్చారని అంటున్నారు. ఆ వజ్రాలతో బెంగాల్ కు చెందిన కళాకారులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.

ఇదే సమయంలో... ఈ విగ్రహంపై వజ్రాలు పొదగడమే కాకుండా, బంగారు నగిషీ కూడా అద్దారు. ఈ పరిణామాలతో ప్రస్తుతం ఈ దుర్గాదేవి మంటపం పెద్ద పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. దీంతో... చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా ఈ విగ్రహాన్ని చూడటానికి వస్తున్నారు.

కాగా... ఇటీవల జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లోనూ రిచ్ వినాయకుడు ముంబైలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలోని ప్రముఖ జీ.ఎస్‌.బీ సేవా మండల్‌ వారు ఏర్పాటు చేసిన మహాగణపతి విగ్రహాన్ని ఏకంగా 69 కిలోల బంగారు, 336 కిలోల వెండి ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువులతో అలంకరించారు. దీనికి రూ.360.40 కోట్ల బీమా కూడా చేయించిన సంగతి తెలిసిందే!