'అబార్షన్' ..అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇదే హాట్ టాపిక్!
ప్రపంచంలోనే ఏకైక అగ్ర రాజ్యం, ప్రపంచ దేశాల పెద్దన్న అమెరికాలో ఈ ఏడాది నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
By: Tupaki Desk | 15 April 2024 10:30 AM GMTప్రపంచంలోనే ఏకైక అగ్ర రాజ్యం, ప్రపంచ దేశాల పెద్దన్న అమెరికాలో ఈ ఏడాది నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి నాలుగేళ్లకోసారి అక్కడ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కూడా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన ప్రైమరీల్లో ఘన విజయాలు సాధించారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున, జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల్లో అబార్షన్ (గర్భస్రావం) అంశం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది అక్కడ పెద్ద రాజకీయ సమస్యగా మారి కూర్చుంది. గతంలో అమెరికా మహిళలకు అబార్షన్ హక్కు ఉండేది. అయితే 2022లో సుప్రీంకోర్టు అబార్షన్ హక్కును రద్దు చేసింది. దీంతో ఈ అంశం ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు.. జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్.. అబార్షన్ అంశంపై స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జో బైడెన్ తన కాథలిక్ విశ్వాసాల కారణంగా వ్యక్తిగతంగా అబార్షన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే అబార్షన్ కావాలా, వద్దా అనే విషయాన్ని మహిళ ఇష్టానికే వదిలేయాలని ఆయన అంటున్నారు. మహిళా హక్కులకు తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఆయన మహిళల గర్భానికి సంబంధించి వారే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే చట్టాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మరోవైపు డోనాల్డ్ ట్రంప్.. జో బైడెన్ వైఖరికి భిన్నంగా ఉన్నారు, మొదట్లో ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు తాను మహిళల హక్కులను కాపాడతానని బీషణ ప్రతిజ్ఞలే చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అబార్షన్ కు వ్యతిరేకంగా వ్యవహరించారు.
ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అబార్షన్ అంశం కీలకం కావడం, ఎన్నికల ఫలితాలను ఇది ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఇద్దరు అభ్యర్థులు ఈ అంశంపై దృష్టి సారించారు. జో బైడెన్ మరోసారి విజయం సాధిస్తే మహిళలు తమ గర్భానికి సంబంధించి వారే నిర్ణయం తీసుకునే హక్కులు పటిష్టమవుతాయని భావిస్తున్నారు.
జో బైడెన్ కాకుండా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయితే మహిళల గర్భస్రావం విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అంతుపట్టడం లేదు. గర్భస్రావానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారో, లేదో తేలాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఈ అనిశ్చితి పరిస్థితుల మధ్య అమెరికన్ మహిళలు గర్భస్రావానికి సంబంధించిన మందులను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసుకుంటున్నారు. అమెరికాలో గర్భస్రావాన్ని నిషేధించడంతో పొరుగు దేశం మెక్సికో నుంచి అక్రమ పద్ధతుల్లో గర్భస్రావానికి సంబంధించిన మాత్రలను తెప్పించుకుని భద్రపర్చుకుంటున్నారు. ముఖ్యంగా మిఫెప్రిస్టోన్ వంటి అబార్షన్ మాత్రలను కొనుగోలు చేస్తున్నారు.
ఈ మాత్రలను ఉపయోగించడం సవాల్ తో కూడుకున్నది. అంతేకాకుండా చాలా డబ్బును వీటికి వెచ్చించాల్సి ఉంటుంది. అయినప్పటికీ రిస్క్ ను భరించి మెక్సికో నుంచి, తదితర మార్గాల్లోనూ గర్భస్రావానికి సంబంధించిన మాత్రలను తెప్పించుకుంటున్నారు.
అబార్షన్ కు సంబంధించి అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా నిబంధనలు ఉండటంతో అబార్షన్ చేసుకునే హక్కును సమర్ధించే వ్యక్తులు ఈ హక్కును కాపాడుకోవడం కష్టతరంగా మారింది.
ఇన్ని కష్టాలు ఎదురైనా అబార్షన్ చేయించుకోవాలా వద్దా అని ఎంచుకునే హక్కును దాన్ని నమ్ముకున్న వారు వదలడం లేదు. తమ సొంత శరీరాలపై, భవిష్యత్తుపై మహిళలకు హక్కు ఉండాల్సిందేనని వారు చెబుతున్నారు.