అమెరికా విద్యార్థి వీసా కొత్త నిబంధనలు... అలా చేస్తే తిరస్కరిస్తారు!
అమెరికాలో ఉన్నత చదువులకు పయనమవుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Nov 2023 5:00 AM GMTఅమెరికాలో ఉన్నత చదువులకు పయనమవుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా వీసా ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని.. అలాకానిపక్షంలో రిటన్ ఫ్లైట్ లోనే వెనక్కి వచ్చేసిన సందర్భాలు వెలుగులోకి వచ్చిన సంగతీ తెలిసిందే! ఈ సమయంలో భారతీయ విద్యార్థుల వీసా ప్రక్రియలో అమెరికా పలు మార్పులు చేసింది.
అవును... అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేస్తున్న విద్యార్థులు ఎఫ్, ఎం, జే స్టూడెంట్ వీసా ప్రోగ్రాం కింద దరఖాస్తు చేయబోతున్న విద్యార్థుల వీసా ప్రక్రియలో అమెరికా పలు మార్పులు చేసింది. ఈ మార్పులను యూఎస్ ఎంబసీ తన ఎక్స్ ఖాతాలో ప్రకటించింది. ఈ సవరణలు ఈ నెల 27 నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజాగా మారిన నిబంధనల ప్రకారం.. ఎఫ్, ఎం, జే స్టూడెంట్ వీసా కోసం ధరఖాస్తు చేస్తున్న విద్యార్థులు దానికోసం ముందుగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ సమయంలో తమ సొంత, ప్రస్తుతం తమ వద్ద ఉన్న పాస్ పోర్ట్ వివరాలను మాత్రమే ఉపయోగించాలి. వీసా దరఖాస్తుల్లో మోసాలు, అపాయింట్ మెంట్ వ్యవస్థ దుర్వినియోగాన్ని అరికట్టడం కోసమే ఈ నిబంధనలను తీసుకొచ్చినట్లు ఎంబసీ తెలిపింది.
విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. అధికారిక వెబ్ సైట్ లో సొంత పాస్ పోర్టు సమాచారాన్నే వినియోగించాలి. తప్పుడు పాస్ పోర్టు నెంబర్ ఇస్తే.. ఆ దరఖాస్తులను వీసా దరఖాస్తు కేంద్రాలవద్ద తిరస్కరిస్తారు. అలాంటి వారి అపాయింట్ మెంట్లను రద్దు చేస్తారు. ఇదే సమయంలో వీసా ఫీజులనూ కూడా వారు కోల్పోవాల్సి ఉంటుంది.
తప్పుడు పాస్ పోర్టు నెంబరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నవారు.. మళ్లీ సరైన నెంబర్ తో కొత్త ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం మళ్లీ వీసా ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. పాత పాస్ పోర్టు పోవడం, చోరీకి గురవడం వంటి సందర్భాల్లో కొత్త పాస్ పోర్టు తీసుకున్నవారు.. పాత పాస్ పోర్టుకు సంబంధించిన కాపీ, ఇతర డాక్యుమెంట్లను అందించాలి.
అప్పుడే వారి అపాయింట్‌మెంట్ ప్రాసెస్ కు అనుమతి లభిస్తుంది. ఎఫ్, ఎం వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా స్టూడెండ్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రాం ధ్రువీకరించిన స్కూల్, ప్రోగ్రాంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగశాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్ షిప్ ను పొందాలి.