Begin typing your search above and press return to search.

మోడీ -పుతిన్ ఆలింగనం మీద అమెరికా అక్కసు.. పెద్దన్న బలుపు

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాలో పర్యటించటం.. ఆ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఆలింగనం చేసుకున్న అంశంపై తాజాగా అమెరికా స్పందించింది.

By:  Tupaki Desk   |   26 July 2024 4:53 AM GMT
మోడీ -పుతిన్ ఆలింగనం మీద అమెరికా అక్కసు.. పెద్దన్న బలుపు
X

అగ్రరాజ్యం అమెరికా బలుపు మామూలుగా ఉండదు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మాత్రమే కాదు.. నిద్రలోనూ యావత్ ప్రపంచం తాము చెప్పింది.. తమ ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించాలన్నట్లుగా భావిస్తూ ఉంటుంది. అదే తీరును ప్రదర్శిస్తూ ఉంటుంది. తనకు నచ్చిందే చేయాలంటూ.. నచ్చనిది చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడని తీరు అమెరికా మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో తమ మిత్ర దేశాలతోనూ.. తమ రాజ్య ప్రయోజనాలు మినహా మరేమీ పట్టించుకోని కఠినత్వం ఆ దేశం సొంతం. అలాంటి అమెరికా తాజాగా తన బలుపును ప్రదర్శించింది.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాలో పర్యటించటం.. ఆ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఆలింగనం చేసుకున్న అంశంపై తాజాగా అమెరికా స్పందించింది. భారత ప్రధాని మోడీ రష్యాలో పర్యటించటం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఆలింగనం చేసుకోవటం తమను షాక్ కు గురి చేసిందని.. తీవ్రంగా నిరాశకు గురి చేసినట్లుగా పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో అతి పెద్ద పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణుల వర్షం కురిపించిన రోజునే పుతిన్ ను మోడీ ఆలింగనం చేసుకోవటం ఏమిటని ప్రశ్నించింది.

తమ అభిప్రాయాల్ని భారత అధికారులతో నిక్కచ్చిగా పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. అమెరికా పెద్దగా పరిగణలోకి తీసుకొని అంశాలు కొన్ని ఉన్నాయి. తన రష్యా పర్యటనలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లో యుద్దం రణక్షేత్రంలో గెలిచేది కాదన్న మోడీ.. యుద్ధంలో చిన్నారుల మరణాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ లెక్కన చూస్తున్నప్పుడు మిత్రుడితో స్నేహధర్మాన్ని పాటిస్తూ.. స్నేహితుడికి హితబోద చేసిన వైనాన్ని మర్చిపోకూడదు.

అయితే.. ఈ విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని అమెరికా.. మోడీ - పుతిన్ ఆలింగనంపై తనకున్న అభ్యంతరాన్ని వెల్లడించింది. ఇదంతా చూసినప్పుడు ప్రంపచంలోని ఏ దేశాధినేత ఎవరిని కలుసుకోవాలి? ఎవరిని ఆలింగనం చేసుకోవాలన్నది కూడా వైట్ హౌస్ డిసైడ్ చేస్తుందా? అన్న క్వశ్చన్ మదిలో మెదలక మానదు.

భారత్ కు అమెరికా సుద్దులు చెప్పటం మానేసి.. తన పని తాను చేసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. రష్యాలో మోడీ పర్యటనపై అమెరికా ఆందోళన చేసిన వైనంపై భారత్ స్పందించింది.

బహుళ ధ్రువ ప్రపంచంలో ఎవరితో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలో నిర్ణయించుకునే హక్కు అన్ని దేశాలకు ఉంటుందని.. ఆ వాస్తవాన్ని గుర్తించిన అమెరికా నడుచుకోవాలంటూ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఏమైనా.. మోడీ - పుతిన్ ఆలింగనంపై రియాక్టు అయిన అమెరికా తీరుతో అగ్రరాజ్య బలుపు మరోసారి ఆసక్తికర చర్చకు కారణమైందని చెప్పాలి.