Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌.. భద్రతా వ్యవస్థలో ఇన్ని లోపాలా?

అగ్ర రాజ్యం అమెరికాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 July 2024 8:30 AM GMT
ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌.. భద్రతా వ్యవస్థలో ఇన్ని లోపాలా?
X

అగ్ర రాజ్యం అమెరికాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ ప్రసంగిస్తున్న వేదికకు 100 మీటర్ల దూరంలోనే ఒక ఇంటిపై నక్కిన ఆగంతకుడు రైఫిల్‌ తో ట్రంప్‌ ను కాల్చిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన గాయపడ్డారు. నిందితుడిని అమెరికా పోలీసులు కాల్చిచంపారు.

కాగా గతంలో పలువురు అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న అధ్యక్ష అభ్యర్థులు తుపాకీ తూటాలకు బలయిన సంగతి తెలిసిందే. ఇంత మంది ప్రాణాలు వదిలినా మళ్లీ అదే తరహా ఘటన జరగడం ఆ దేశాన్ని నివ్వెరపరిచింది. ఈ నేపథ్యంలో అమెరికా భదత్రా వ్యవస్థలోని లోపాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

వాస్తవానికి ప్రపంచంలోనే అత్యంత పటిష్ట భద్రతా వ్యవస్థ ఉన్న దేశంగా అమెరికాను చెబుతారు. అయితే గతంలో ఆల్‌ ఖైదా ఉగ్రవాది అమెరికాపై విమానాలతో దాడి చేసి వందల మంది మరణానికి కారకుడయ్యాడో అప్పుడే అమెరికా భద్రతా వ్యవస్థలోని లోపాలు బహిర్గతమయ్యాయి.

ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పై హత్యాయత్నంతో మరోసారి అమెరికా భద్రతా వ్యవస్థలోని లోపాలు బయటపడ్డాయి. చివరిసారిగా 1981లో రోనాల్డ్‌ రీగన్‌ పై హత్యాయత్నం తర్వాత అమెరికా అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నాలు జరగలేదంటున్నారు.

ఇప్పుడు ట్రంప్‌ పై తాజా దాడితో.. ప్రపంచంలోనే గొప్ప భద్రతా వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ లో లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా మాజీ అధ్యక్షుల భద్రతపై అనేక ప్రశ్నలు ముసురుతున్నాయి.

అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులతోపాటు, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించే బాధ్యత.. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ చూస్తోంది. ఇందులో అత్యంత చురుకైన, పటిష్టమైన, సుశిక్షితులైన భద్రతా సిబ్బంది ఉంటారు. అయితే అధ్యక్షుడితో పోలిస్తే మాజీ అధ్యక్షులకు కొంచెం భద్రత తక్కువేనని అంటున్నారు. అయినప్పటికీ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని చెబుతున్నారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ కు ఏకంగా 75 మంది సీక్రెట్‌ సర్వీస్‌ కు చెందిన భద్రతా సిబ్బంది 24 గంటలపాటు రక్షణగా ఉంటారు. వీరు మాజీ అధ్యక్షుడు హోదాలో ట్రంప్‌ సందర్శించే ప్రాంతాలను ముందుగానే తనిఖీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. జాగిలాలను రంగంలోకి దించడంతోపాటు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలపైనా కన్నేసి ఉంచాలి. అలాగే ఆయన సమీపంలోకి ఎవరైనా వస్తుంటే అడ్డుకుని ఆరా తీశాకే పంపాలి.

సీక్రెట్‌ సర్వీస్‌ లో పలు విభాగాల భద్రతా సిబ్బంది ఉంటారు. ఇందులో క్లోజ్‌ ప్రొటెక్షన్‌ టీమ్‌ ఒకటి... విపత్కర పరిస్థితుల్లో వీరు తమ ప్రాణాన్ని అడ్డేసి అయినా మాజీ అధ్యక్షుడిని కాపాడతారు. అలాగే సీక్రెట్‌ సర్వీస్‌ లోనే కౌంటర్‌ అసాల్ట్‌ టీమ్‌ కూడా ఉంటుంది. దగ్గరలో ఉండి చంపడానికి ప్రయత్నించేవారిని ఈ బృందం మట్టుబెడుతుంది. అదేవిధంగా కౌంటర్‌ స్నైపర్‌ టీమ్‌ కూడా ఉంటుంది. దూరంగా ఉండి హత్య చేయడానికి ప్రయత్నించేవారిని గుర్తించి ఈ టీమ్‌ హతమారుస్తుంది.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ భద్రతా సిబ్బందిలో ఇన్ని విభాగాల నిష్ణాతులు ఉన్నా హత్యాయత్నాన్ని అరికట్టలేకపోయారు. మాజీ అధ్యక్షుడుగానే కాకుండా వచ్చే ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగుతున్న ఆయనకు తగినంతగా భద్రత కల్పించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.