Begin typing your search above and press return to search.

పాక్ కొత్త ప్రభుత్వానికి అమెరికా షాక్

దీంతో, పీపీపీతో పొత్తు పెట్టుకొని పీఎంఎల్-ఎన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

By:  Tupaki Desk   |   2 March 2024 3:48 AM GMT
పాక్ కొత్త ప్రభుత్వానికి అమెరికా షాక్
X

ఇటీవల పాకిస్తాన్ లో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ గుర్తుపై పోటీ చేయకూడదని కోర్టు తీర్పు ఉండడంతో ఆయన తరఫున అభ్యర్థులంతా ఇండిపెండెంట్ లుగా బరిలోకి దిగారు. అయితే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పి ఎం ఎల్ ఎన్ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో, పీపీపీతో పొత్తు పెట్టుకొని పీఎంఎల్-ఎన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే దానికి అమెరికా డెమొక్రటిక్ పార్టీ సభ్యులు షాక్ ఇచ్చారు. పాకిస్తాన్లో ఏర్పడబోతున్న కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వొద్దంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు డెమోక్రటిక్ సభ్యులు లేఖ రాయడం సంచలనం రేపుతోంది. ఇటీవల జరిగిన పాకిస్తాన్ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని, ఆ వ్యవహారాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. ఫిబ్రవరి 8 నాడు జరిగిన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగింది అన్నందుకు బలమైన ఆధారాలున్నాయని ఆ లేఖలో వారు వెల్లడించారు.

ఆ వ్యవహారంపై పారదర్శకంగా సమగ్ర దర్యాప్తు జరిగే వరకు వేచి ఉండాలని వారు కోరారు. లేదంటే అక్కడ ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తిని తక్కువ అంచనా వేసినట్లేనని, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సమర్థించినట్లేనని వారు చెప్పారు. ఇక, ఇదే విషయంపై పాక్ పార్లమెంటులో కూడా పిటిఐ మద్దతుదారులు గందరగోళం సృష్టించారు. ఈ గందరగోళాల నడుమే పాక్ నూతన ప్రధానిగా నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.