సీఏఏ చట్టంపై అమెరికా కీలక వ్యాఖ్యలు
దీని అమలులో భారత్ ఎలాంటి మార్గాలు అన్వేషిస్తుందోనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సంశయం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 15 March 2024 6:30 AM GMTసీఏఏ (సిటిజన్ షిప్ అమండ్ మెంట్ ఆక్ట్ )పై సర్వత్రా విమర్శలు లేవనెత్తుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కూడా దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ చట్టం అమలు ఎలా ఉంటుందోననే దానిపై తర్జనభర్జన పడుతోంది. చట్టం అమలు చేసి తీరుతామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సీఏఏ అమలు కోసం భారత్ జారీ చేసిన నోటిఫికేషన్ పై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. దీని అమలులో భారత్ ఎలాంటి మార్గాలు అన్వేషిస్తుందోనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సంశయం వ్యక్తం చేశారు. మార్చి 11న వచ్చిన సీఏఏ నోటిఫికేషన్ పై నిశితంగా పరిశీలిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో సీఏఏ అమలు మనదేశంలోనే కాదు అమెరికాలో కూడా వేడి పుట్టిస్తోంది.
ప్రజాస్వామ్య దేశంలో మత స్వేచ్ఛ ఉంటుంది. భారత్ లో కేంద్రం తీసుకున్న నిర్ణయం సరిగా లేదని ఆలోచిస్తోంది. చట్ట ప్రకారం అందరిని సమానంగా చూడాల్సిన బాధ్యత ఉన్నా ఒక వర్గాన్ని దూరం పెట్టే చట్టం అమలు సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. దీంతో సీఏఏ అమలు తీరుపై అందరిలో అనుమానాలు రావడం సహజమే.
సీఏఏ చట్టం 2019లోనే తీసుకొచ్చారు. కరోనా వల్ల దాని అమలు వాయిదా వేశారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో దాన్ని ఆమోదింపజేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. ఇది ఎవరి ప్రయోజనాలను కాలరాయదు అని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో అర్థం లేదని కొట్టిపారేస్తున్నారు. దీని వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు.
ఈనేపథ్యంలో సీఏఏ చట్టంపై అగ్రరాజ్యం కూడా ఆలోచనలో పడటంతో దీని అమలు ప్రశ్నార్థకంగా మారుతుందా? కేంద్రం మాత్రం దీని అమలు ఆపేది లేదని తేల్చడంతో అందరిలో ఆత్రుత నెలకొంది. ఎన్నికల వేళ దీని అమలు ఎలా చేస్తుందనే కోణంలో ఆలోచనలు వస్తున్నాయి. బీజేపీ మెడకు చుట్టుకున్న పాములా సీఏఏ మారిందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.