Begin typing your search above and press return to search.

మళ్లీ మొదలైన వివాదం... కెనాడాకు మద్దతు పలికిన యూఎస్, యూకే!

అవును... భారత్ హెచ్చరికలు, తమ దౌత్యవేత్తలను కెనడా వెనక్కి రప్పించుకోవడాలు వంటి పరిణామాల నేపథ్యంలో... అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 9:35 AM GMT
మళ్లీ మొదలైన వివాదం... కెనాడాకు మద్దతు పలికిన యూఎస్, యూకే!
X

గతకొంతకాలంగా ఇండియా - కెనడా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడి హత్య కారణంగా భారత్, కెనడా మధ్య వివాదం రోజు రోజుకీ ముదిరి పాకానడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. భారత్‌ లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఢిల్లీ డిమాండ్‌ చేయడం.. దానికి ప్రతిస్పందనగా కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకుంది.

అనంతరం... భారత్‌ హెచ్చరికల కారణంగానే తమ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చినట్లు కెనడా చేసిన ప్రకటనతో ఇరు దేశాల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. వాస్తవానికి దౌత్యసిబ్బందిని కెనడా ఉపసంహరించుకోకపోతే వారి రక్షణను ఉపసంహరిస్తామని రెండు వారాల కిందట భారత్ హెచ్చరించిందని తెలుస్తుంది. దీంతో... ఈ హెచ్చరికలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని కెనడా అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో... 41 మంది కెనడా దౌత్యవేత్తలు ఇండియా నుంచి వెనక్కి వెళ్లిపోయారు. దీంతో... కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబసభ్యులు భారత్‌ ను వీడినట్టు గురువారం కెనడా విదేశాంగ మంత్రి మెలనియ్ జోలీ నిర్ధరించారు. అక్టోబరు 20 నాటికి 21 మంది దౌత్యవేత్తలకు మినహా మిగిలినవారికి రక్షణను తొలగిస్తామని భారత్ చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ సమయంలో అమెరికా, యూకేలు స్పందించాయి.

అవును... భారత్ హెచ్చరికలు, తమ దౌత్యవేత్తలను కెనడా వెనక్కి రప్పించుకోవడాలు వంటి పరిణామాల నేపథ్యంలో... అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. వియన్నా ఒప్పంద సూత్రాల ప్రకారం దౌత్య సంబంధాలపై న్యూఢిల్లీ తన బాధ్యతలను నిర్వర్తించాలని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో యూకే కూడా ఈ విషయంలో కెనడాకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దీంతో అటు అమెరికా, ఇటు యూకే రెండు దేశాలూ కెనడాకు మద్దతుగానే మాట్లాడినట్లయ్యింది. ఇందులో భాగంగా... భారత్‌ లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఢిల్లీ డిమాండ్‌ చేయడం.. దానికి ప్రతిస్పందనగా కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని మొదలుపెట్టిన అమెరికా... విభేదాల పరిష్కారానికి దౌత్యవేత్తలు విధుల్లో ఉండటం అవసరమని అభిప్రాయపడింది.

ఇదే క్రమంలో... 1961 నాటి వియన్నా ఒప్పంద సూత్రాల కింద కెనడా దౌత్య మిషన్‌ లో గుర్తింపు పొందిన సభ్యులకు లభించే అధికారాలు, దౌత్యపరమైన రక్షణ భారత్ వారికి కల్పించాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇదే సమయంలో బ్రిటన్‌ విదేశాంగ శాఖ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. కెనడాకు అనుకూలంగా మాట్లాడింది!

ఇందులో భాగంగా... కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకునేలా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించలేమని, దౌత్యవేత్తలకు భద్రత కల్పించే దౌత్య రక్షణను ఏకపక్షంగా ఎత్తివేయడం అనేది వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణంగా లేదని యూకే విదేశాంగ శాఖ కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు.

కాగా... ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలపై భారత్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అలా కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యల నుంచి ఇరు దేశాల సంబంధాలు క్రమక్రమంగా దెబ్బతింటూ వస్తున్నాయి. అయితే ఈ విషయంలో అమెరికా మొదట్లో తటస్థంగా వ్యవహరించినా... ఆ తర్వాత కెనడాకు మద్దతుగా స్పందించడం మొదలుపెట్టింది.

ఇలా కెనడా దౌత్యవేత్తల విషయంలో భారత్ చేసిన వ్యాఖ్యలు, దీంతో కెనడా తీసుకున్న నిర్ణయాలపై అగ్రరాజ్యం అమెరికా, యూకేలు ఒకేసారి భారత్ ని తప్పుపట్టడం మాత్రం అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యిందని అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై భారత్ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.