Begin typing your search above and press return to search.

అమెరికాకు 'జలుబు' చేస్తే ప్రపంచం ఆగమాగం కావాల్సిందే

నాస్ డాక్ 2.4శాతం కూలితే.. డోజోన్స్ 1.5 వాతం.. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించటం గమనార్హం.

By:  Tupaki Desk   |   7 Aug 2024 5:16 AM GMT
అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం ఆగమాగం కావాల్సిందే
X

అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచ స్టాక్ మార్కెట్లకు తమ్ములు మొదలవుతాయన్నట్లుగా పరిస్థితులు మారాయి. అగ్రరాజ్యానికి మాంద్యం ముప్పు ఉందన్న అంచనాలుప్రపంచ మార్కెట్లను కుదేలు అయ్యేలా చేస్తున్నాయి. ఇది సరిపోదననట్లుగా దక్షిణాసియాలో నెలకొన్న పలు పరిణామాలు.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని పరిస్థితులు ప్రపంచ స్టాక్ మార్కెట్ల మీద ప్రభావాన్ని చూపాయి. యూఎస్ తయారీ.. నిర్మాణ రంగంలో బలహీనతకు గత వీకెండ్ లో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా మరింత భయాన్ని కలుగుజేసింది.

అంచనాలకు భిన్నంగా జులైలో హైరింగ్ 1.14 లక్షలకు పరిమితం కావటం.. అంచనాలకు 1.80 లక్షల జాబ్స్ తగ్గటంతో పాటు జూన్ లో ఉన్న 4.1 శాతం నిరుద్యోగిత..జులైలో 4.3 శాతానికి పెరగటంతో అమెరికాలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. 2021 అక్టోబరు తర్వాత నిరుద్యోగ రేటు ఈ స్థాయికి చేరుకోవటం ఇదే తొలిసారి. దీనికి తోడు ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్ తో సహా మరికొన్ని కంపెనీలు తాజాగా కొలవులకు కోత విధించటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. పెట్టుబడిదారుల్లో కొత్త భయాల్ని తీసుకొచ్చింది.

అమెరికా మార్కెట్ కకావికలం కావటం.. దాని ఎఫెక్టుతో ప్రపంచ మార్కెట్లు బేర్ మంటున్నాయి. నాస్ డాక్ 2.4శాతం కూలితే.. డోజోన్స్ 1.5 వాతం.. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించటం గమనార్హం. గత నెలలో ఆల్ టైం రికార్డుకు చేరుకున్న నాస్ డాక్ ఇప్పుడు అందుకు భిన్నంగా పది శాతం పతనమైంది. కరెక్షన్ లోకి వెళ్లింది. అమెరికా పుణ్యమా అని ఆసియా.. యూరోప్ మార్కెట్లు సైతం ప్రభావానికి లోనయ్యాయి.

నాస్ డాక్ లో టాప్ 7 టెక్ టైటాన్స్ షేర్లు అతలాకుతలమవుతున్నాయి. ఈ టాప్ 7 కంపెనీల్లో యాపిల్.. మైక్రోసాఫ్ట్.. ఆల్పాబెట్.. అమెజాన్.. ఎన్ వీడియా.. టెస్లా..మెటా కంపెనీ షేర్లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద భారీగా ఖర్చు చేస్తున్న మైక్రోసాఫ్ట్.. ఆల్పాబెట్ లాంటి కంపెనీలు ఆశించినంత ఆదాయాల్ని సాధించటం లేదు. దీంతో.. ఆందోళనలు మొదలయ్యాయి.

అమెజాన్ షేర్ 10 శాతం తగ్గితే.. ఇంటెల్ షేర్లు ఏకంగా 26 శాతానికి కుప్పకూలటం గమనార్హం.ఈ కంపెనీ తన ఉద్యోగుల్లో 15వేల మందికి మంగళం పాడటంతో జాబ్ మార్కెట్ లో గగ్గోలు మొదలైంది. టాప్ 7 టెక్ షేర్ల మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరి కావటం ఆందోళనకు గురి చేస్తోంది. అంచనాలకు మించి ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులకు తోడుగా పశ్చిమాసియాలో చోటుచేసుకున్న తాజా ఉద్రిక్తలు మరింత ఇబ్బందికరంగా మారాయి. హమస్ చీఫ్ ఇరాన్ లో పర్యటిస్తున్న వేళ.. ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ ఏసేయటంతో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన చేసింది.

ఇప్పటికే రష్యా - ఉక్రెయిన్ ఉద్రిక్తలు ఒక కొలిక్కి రాకముందే మరోయుద్ధ భయం నెలకొంది. అదే జరిగితే పరిస్థితి మరిత దారుణంగా మారుతుంది. ఇప్పటికే అమెరికా దెబ్బతో జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్ అయ్యింది. 1987 అక్టోబరు 19న బ్లాక్ మండే తర్వాత ఈ స్థాయిలో ఘోర పతనం ఇదే కావటం గమనార్హం. జపాన్ యెన్ పతనం.. ద్రవ్యోల్బణం 2 శాతం లక్ష్యం పైకి ఎగబాకడంతో పాటు అందరికి భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళుతోంది. దీంతో డాలర్ తో ఇటీవల 160 స్థాయికి చేరుకున్న యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు తెప్పిస్తోంది. జపాన్.. అమెరికా ప్రభావం ప్రపంచ మార్కెట్ల మీద పడింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్ల పెంపునకు చర్యలు చేపట్టటం తెలిసిందే.