అమెరికా వాళ్లకు ఇదేం వింత కోరిక!
ప్రపంచమంతా అమెరికా పాస్ పోర్టు కావాలని కోరుకుంటుంటే ఆ దేశస్తులు మాత్రం తమకు ఇంకో పాస్ పోర్టు కావాలని కోరుకుంటుండటం విశేషం.
By: Tupaki Desk | 13 April 2024 6:03 AM GMTప్రపంచంలోనే ఏకైక అగ్రరాజ్యం, ప్రపంచ దేశాలకు పెద్దన్నలాంటి దేశం.. అమెరికా. అత్యుత్తమ విద్య, ఉపాధి అవకాశాలు పొందాలంటే అందరికీ మొదట గుర్తొచ్చే దేశం.. అమెరికానే. ఆ దేశ పౌరసత్వం పొందాలని, పాస్ పోర్టు పొందాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్లు ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. పరిస్థితి ఇది కాగా.. అమెరికా వాళ్ల కోరిక మాత్రం విచిత్రంగా ఉంది.
ప్రపంచమంతా అమెరికా పాస్ పోర్టు కావాలని కోరుకుంటుంటే ఆ దేశస్తులు మాత్రం తమకు ఇంకో పాస్ పోర్టు కావాలని కోరుకుంటుండటం విశేషం. ముఖ్యంగా చాలామంది సంపన్న అమెరికన్లు ఇతర దేశాల పాస్ పోర్టులను కోరుకుంటున్నారు. ముఖ్యంగా సంపన్నులు భద్రతా కారణాల రీత్యా, ఇతర పరిస్థితుల దృష్ట్యా తమకు రెండో పాస్ పోర్టు ఉంటే మంచిదని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా అమెరికాతోపాటు వేరే దేశ పౌరసత్వాన్ని కూడా అమెరికన్ సంపన్నులు కోరుకుంటున్నారని తెలుస్తోంది. తమ దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి తమకు ఆర్థిక రక్షణ, భద్రత కల్పించే సురక్షిత దేశాలవైపు అమెరికన్లు చూస్తున్నారని చెబుతున్నారు.
ముఖ్యంగా అమెరికాలో బాగా డబ్బున్నవారు వేరే దేశాల పౌరసత్వాన్ని కోరుకుంటున్నారని అంటున్నారు. అమెరికా ప్రభుత్వం తమ పౌరులకు బహుళ పౌరసత్వాలను అనుమతిస్తోంది. దీంతో వారు వేరే దేశాల పౌరసత్వాలను కూడా పొందాలనుకుంటున్నారు.
అమెరికాలో ఒక బిలియనీర్ న్యూజిలాండ్ లో, సైప్రస్ లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం ఇందుకు నిదర్శనం. అయితే అమెరికన్లు తమ పౌరసత్వాన్ని వదులుకోవడం లేదు. వేరే దేశపు పాస్ పోర్టు లేదా పౌరసత్వాన్ని బ్యాకప్ ప్లాన్ గా ఉంచుకుంటున్నారు. ఇందుకోసం ఇతర దేశాలవైపు అమెరికా సంపన్నులు దృష్టి సారించారు.
ఈ క్రమంలో సంపన్న అమెరికన్ల దృష్టి పోర్చుగల్, మాల్టా, గ్రీస్, ఇటలీ తదితర దేశాలపై పడింది. ఈ దేశాలు తమ దేశంలో పెట్టుబడి పెట్టే వారికి ప్రతిఫలంగా తమ దేశ పౌరసత్వాన్ని అందిస్తున్నాయి.
ధనిక అమెరికన్లు ఇలా చేయడానికి కొన్ని కారణాలున్నాయని అంటున్నారు. రెండో పాస్ పోర్టు కలిగి ఉంటే ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్న దేశాలకు సులభంగా వెళ్లవచ్చు. అలాగే బహుళ పౌరసత్వాలు ఉండటం ఒక స్టేటస్ సింబల్ గా ఉంది. దీంతో సంపన్నులు తమ డాబును చూపించుకోవడానికి వేరే దేశాల పౌరసత్వాలను పొందాలనుకుంటున్నారని చెబుతున్నారు.
ఇంకొందరు అమెరికాలో ఉండి విసుగు చెందారని.. మార్పు కోసం వేరే దేశాల్లో కొత్త మకాం కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో మంచి జీవనశైలి, శాంతియుత వాతావరణం, భద్రత ఉన్న దేశాలకు పెద్దపీట వేస్తున్నారు.