బాబు మద్దతు కోరిన అమిత్ షా ?
ఇదిలా ఉంటే చంద్రబాబు తో అమిత్ షా మీట్ లో కీలక అంశాలే చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 19 Jan 2025 3:12 AM GMTకేంద్ర హోంమంత్రి అమిత్ షా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో డిన్నర్ మీటింగ్ పెట్టారు. దాదాపుగా గంట పాటు అక్కడే గడిపారు. ఈ మీట్ లో జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు తో అమిత్ షా మీట్ లో కీలక అంశాలే చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
త్వరలో జరగనున్న కేంద్ర బడ్జెట్ సమావేశాలలో జమిలి ఎన్నికల బిల్లుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుందని అంటున్నారు. శీతాకాల సమావేశాలలో ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించి వంద రోజుల గడువు విధించారు. ఇక బడ్జెట్ రెండు సెషన్లుగా సాగనున్న నేపథ్యంలో మార్చి 10 నుంచి మొదలయ్యే రెండో సెషన్ లో జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని అంటున్నారు. ఈ బిల్లు ఆమొదం పొందాలీ అంటే ముందు కూటమి పార్టీల పూర్తి మద్దతు ఉండాలి.
అందుకోసమే అమిత్ షా ఈ విషయాన్ని డిన్నర్ మీట్ లో చంద్రబాబుతో చర్చించారు అని అంటున్నారు. ఇక బిల్లుకు అవసరమైన మిగిలిన మద్దతును ఎన్డీయేలోకి ఇతర పార్టీలను ఆహ్వానిచడం తటస్థ పార్టీల మద్దతు తీసుకోవడం ద్వారా పరిపూర్తి చేసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.
మరో కీలక బిల్లు కూడా ఈసారి పార్లమెంట్ కి రానుంది అని అంటున్నారు. అదే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. ఈ బిల్లు విషయంలో కూడా కేంద్రానికి టీడీపీ మద్దతు అవసరం ఉంది. ఈ బిల్లుని బీజేపీ ప్రతిష్టగా భావిస్తోంది. ఈ బిల్లుని ఆమోదించాలని తద్వారా తన అజెండాను అమలు చేయాలని బీజేపీ చూస్తోంది.
అయితే ఈ బిల్లు విషయంలో టీడీపీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అంటున్నారు. మైనారిటీ వర్గాల నుంచి ఈ బిల్లుకు నిరసన వ్యక్తం అవుతున్న నేపధ్యంలో టీడీపీ ఈ బిల్లుకు సుముఖంగా ఉంటుందా అన్నది కూడా చర్చగా ఉంది. దాంతో అమిత్ షా ఈ రెండు కీలక బిల్లుల గురించి టీడీపీ అధినాయకుడి మనసులో విషయాన్ని తెలుసుకోదలచారు అని అంటున్నారు.
డిన్నర్ మీట్ లో ఈ అంశాలు ప్రత్యేకంగా చర్చకు వచ్చాయని చెబుతున్నారు. అదే సమయంలో ఏపీ రాజకీయాల గురించి కూడా చంద్రబాబుతోనూ పవన్ తోనూ అమిత్ షా చర్చించారని అంటున్నారు. మొత్తానికి అమిత్ షా పెద్ద పని మీదనే బాబు ఇంటికి విందుకు వచ్చారని అంటున్నారు. మరి బాబు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది త్వరలో తేలనుంది.