Begin typing your search above and press return to search.

ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్... అమిత్ షా అంగీకరించలేదా?

ఈ సమయంలో స్పందించిన అంబటి రాంబాబు... అమిత్ షా ఏపీ పర్యటనలో భాగంగా... లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తానంటూ చంద్రబాబు తెచ్చిన ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలిపారు.

By:  Tupaki Desk   |   20 Jan 2025 4:47 AM GMT
ఏపీ డిప్యూటీ  సీఎంగా లోకేష్... అమిత్  షా అంగీకరించలేదా?
X

ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు ఏపీ కేబినెట్ మొత్తం ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కుకు ఇటీవల భారీ ప్రోత్సాహం ప్రకటించిన నేపథ్యంలో మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమయంలో చంద్రబాబు ఇంట అమిత్ షా కు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

ఈ సమయంలో సుమారు అర్ధగంట పాటు చంద్రబాబు - అమిత్ షా లు ఆంతరంగిక చర్చల్లో పాల్గొనగా.. అనంతరం పవన్ కల్యాణ్, లోకేష్ మొదలైనవారు ఆ భేటీలో జాయిన్ అయినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో... వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఎన్ని ప్యాలెస్ లు ఉన్నాయని అమిత్ షా అడిగారని.. ఎక్కడేక్కడున్నాయో బాబు & కో చెప్పారని కథనాలు వచ్చాయి.

దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఇందులో భాగంగా... ఏపీలో ఎన్నో సమస్యలు ఉంటే... అమిత్ షా అంతటివారు వస్తే మాట్లాడుకోవాల్సినవి జగన్ కు ఉన్న భవనాల గురించా..? లేక, ఆంధ్రుల బ్రతుకు చిత్రం గురించా..? అంటూ మండిపడ్డారు. ఈ సమయంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడంపై ఆసక్తికర విషయం తెరపైకి తెచ్చారు!

అవును... తెలుగుదేశం పార్టీ తరుపున ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను ఎంపిక చేయాలని.. అన్ని విధాలా అతనికి అర్హతలు ఉన్నాయని.. జగన్ సీఎం కావాలని, పవన్ కల్యాణ్ కూడా సీఎం కావాలని ఆయా పార్టీల కార్యకర్తలు ఎలాగైతే కోరుకుంటారో.. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఈ సమయంలో స్పందించిన అంబటి రాంబాబు... అమిత్ షా ఏపీ పర్యటనలో భాగంగా... లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తానంటూ చంద్రబాబు తెచ్చిన ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలిపారు. ఈ మేరకు తమకూ సమాచారం ఉందని.. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తామన్న ప్రతిపాదనపై అమిత్ షా ఏమన్నారో తమకూ తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... లోకేష్ అన్ని శాఖల్లోనూ వేలు పెడుతున్నారని.. అతనిని కంట్రోల్ లో ఉంచాలని చంద్రబాబు అమిత్ షా సూచించారని.. ఇదే సమయంలో.. లోకేష్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమయ్యాడని, స్పీడ్ తగ్గించుకోవాలని హెచ్చరించారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఈ విషయం బయటకు రాకుండా కూటమి నేతలు వేరే కథలు వండి వారిస్తున్నారని అంబటి మండిపడ్డారు.