Begin typing your search above and press return to search.

కాశ్మీర్ కి కొత్త పేరు...బీజేపీ మాస్టర్ ప్లాన్ ?

జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇటీవల ఎన్నికలు జరిగాయి. జమ్మూలో 29 సీట్లు సాధించిన బీజేపీ కాశ్మీర్ లో ఒక్క సీటూ సాధించలేకపోయింది.

By:  Tupaki Desk   |   3 Jan 2025 3:35 AM GMT
కాశ్మీర్ కి కొత్త పేరు...బీజేపీ మాస్టర్ ప్లాన్ ?
X

జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇటీవల ఎన్నికలు జరిగాయి. జమ్మూలో 29 సీట్లు సాధించిన బీజేపీ కాశ్మీర్ లో ఒక్క సీటూ సాధించలేకపోయింది. ఇక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 48 అయితే దాని కంటే ఎక్కువ సీట్లను సొంతంగానే సాధించి నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేశారు.

బీజేపీ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా అయితే ఇవ్వలేదు. కేంద్ర పాలిత ప్రాంతంగానే అవి ఉన్నాయి. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలే కొనసాగుతున్నాయి. రాష్ట్ర హోదా కేంద్రంలో ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఇవ్వాలని కాశ్మీర్ నేతలు కోరుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా జమ్మూ కాశ్మీర్ మీద రచించిన ఒక పుస్తకాన్ని కొత్త ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కాశ్మీర్ మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పటికి ఎనిమిది వేల ఏళ్ల నాటి నుంచి కూడా భారత్ లో భాగమే అని ఆయన చెప్పారు.

దానికి చారిత్రక పురాణేతిహాసాలు అధారాలూ అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ సంస్కృతి భారతదేశ సంస్కృతి ఒక్కటే అని అన్నారు. కాశ్మీర్ కి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పారు. లడక్ లో దేవాలయాలు విధ్వంశం కావడం, కాశ్మీర్ లో సంస్కృత భాష ఉపయోగించడం ఇవన్నీ ఏ చరిత్రా చెప్పడం లేదని అన్నారు.

స్వాతంత్ర్యానంతరం దేశం జరిగిన అనేక పొరపాట్లను ఈ పుస్తకంలో ప్రస్తావించారు అని అన్నారు. అంతే కాదు కాశ్మీర్ అన్న పేరు మూలాన్ని కూడా అమిత్ షా చెప్పారు కశ్యపుడు అనే రుషి పేరు మీదనే కాశ్మీర్ ఏర్పాటు అయిందని అన్నారు. ఆ విధంగా చూస్తే కనుక కాశ్మీర్ కి రుషి కశ్యపుడు పేరుని పెట్టడం సముచితమని అన్నారు.

రుషి కశ్యప హిందూమతంలో ఎంతో గౌరవనీయమైన స్థానంలో ఉన్న రుషి అని ఆయన గుర్తు చేశారు. అందువల్ల కశ్యపుడు భూమి అయిన కాశ్మీర్ కి ఆయన పేరు పెట్టడం ఎంతో సమంజసమని హోం మంత్రి అన్నారు. అది కూడా సాధ్యమేనని కూడా చెప్పుకొచ్చారు.

ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ మీద బీజేపీకి అభిమానం మోజు ఇంకా అధికంగానే ఉన్నాయని అంటున్నారు. బీజేపీ ఎప్పటికైనా కాశ్మీర్ ని ఏలాలని చూస్తోంది. ఇటీవల ఎన్నికల్లో కాశ్మీర్ లో కూడా మంచి ఓటింగ్ శాతాన్ని పెంచుకున్న బీజేపీ ఇపుడు కాశ్మీర్ భూమి కశ్యపుడిది అని అంటోంది. ఆయన పేరు పెట్టడం ద్వారా కొత్త కాశ్మీర్ ని చేస్తామని అంటోంది. దాంతో నిజంగా రుషి కశ్యపుడి పేరు పెడతరా పెడితే రాజకీయ పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిందే అని అంటున్నారు.