ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!
జనవరి 19 రాత్రి నుంచి మలుమార్లు ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని తెలిపారు. మృతుల్లో అలిపిరి ఘటన సూత్రధారి ఉన్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 21 Jan 2025 1:50 PM GMTఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నౌపాడ, గరియాబంద్ జిల్లాల్లో భద్రతా బలగాలకు - నక్సలైట్లకు జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు వెల్లడించారు. జనవరి 19 రాత్రి నుంచి మలుమార్లు ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని తెలిపారు. మృతుల్లో అలిపిరి ఘటన సూత్రధారి ఉన్నట్లు చెబుతున్నారు.
అవును... ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లోని గరియా బంధ్, నౌపాడలో భద్రతాబలగాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో సోమవారం ఇద్దరు మృతి చెందగా.. మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరో 18 మంది నక్సల్స్ మృతి చెందినట్లు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ లో ఛత్తీస్ గఢ్, ఒడిశా పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్న వేళ.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో భారీ స్థాయిలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ స్పెషల్ ఆపరేషన్ లో సుమారు 1000 మంది వరకూ భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని అంటున్నారు.
మృతుల్లో అలిపిరి ఘటన సూత్రధారి!:
తాజాగా ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లో భద్రతాబలగాలు - మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మృతి చెందగా.. వారిలో కీలక నేతలు మృతి చెందినట్లు చెబుతున్నారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు, మనోజ్ లు ఉన్నారని అంటున్నారు.
కాగా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై గతంలో అలిపిరిలో జరిగిన దాడి కేసులో కీలక సూత్రధారిగా చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇతనిపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఇతడు చిత్తూరు జిల్లా వాసి.
అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!:
ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 20 మంది మృతి చెందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. మావోయిస్టు రహిత భారత్ దిశగా కీలక అడుగు పడిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో నక్సలిజం అనేది కొన ఊపిరితో ఉందని తెలిపారు.
తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది వరకూ మృతి చెందగా.. అందులో కీలక నేతలు కూడా ఉండటం నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పిన అమిత్ షా... భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయమని అన్నారు.