"నేను కొంత డబ్బు తీసుకోవచ్చా అమితాబ్?" - రతన్ టాటా!
అవును... బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16వ సీజన్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది.
By: Tupaki Desk | 29 Oct 2024 11:07 AM GMTభారతదేశ ముద్దు బిడ్డ రతన్ టాటా ఈ లోకాన్ని విడిచి వెళ్లినా.. ఆయన గురించి నిత్యం ఏదో ఓ మూల చర్చ జరుగుతూనే ఉంది. ఆయన గొప్పతనం గురించి, ఆయన ఉదార స్వభావం గురించి, ఆయన సింప్లిసిటీ గురించి, ఆయన వ్యాపార దక్షత గురించి. ఈ సమయంలో తాజాగా అమితాబ్ బచ్చన్ మరోసారి రతన్ టాటాను తలచుకున్నారు!
అవును... బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16వ సీజన్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో.. ఫరాఖాన్, బోమన్ ఇరానీ బిగ్ బీ ముందున్న హాట్ సీట్ లో కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో... రతన్ టాటాని గుర్తు చేసుకున్నారు అమితాబ్ బచ్చన్!
ఇందులో భాగంగా లండన్లో రతన్ టాటా తనను డబ్బులు అడిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అమితాబ్. రతన్ టాటా ఎటువంటి వ్యక్తి అనే విషయం తాను చెప్పలేనని.. ఎందుకంటే అతను అత్యంత సాధారణంగా కనిపించే ఓ అసాధారణ వ్యక్తి అని అన్నారు. అంతేకాదు.. ఓ సారి రతన్ టాటా, తాను ఒకే విమానంలో లండన్ వెళ్లామని చెప్పారు.
ఆ సమయంలో ఇద్దరం లండన్ విమానాశ్రయంలో దిగామని చెప్పిన అమితాబ్.. ఆ సమయంలో రతన్ టాటాను పికప్ చేసుకొవడానికి వచ్చినవారిని చూసినట్లు లేదని.. దీంతో, వారికి ఫోన్ చేయాలని టెలిఫోన్ బూత్ కి వెళ్లారని.. అనంతరం.. “అమితాబ్... మీ దగ్గర డబ్బులు తీసుకోవచ్చా?.. ఫోన్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు” అని అడిగారని చెప్పారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. రతన్ జీ గురించి ఎంత చెప్పుకున్నా, ఎలా చెప్పుకున్న తక్కువే అని.. ఆయన మనిషి రూపంలో పుట్టిన మరో శక్తి అని కొనియాడుతున్నారు ఆయన అభిమానులు!
కాగా.. అక్టోబర్ 10వ తేదీన తన ఇన్ స్టా గ్రామ్ లో రతన్ టాటాతో ఉన్న ఫోటొను పంచుకున అమితాబ్.. "ఒక యుగం ఇప్పుడే గడిచిపోయింది.. అతని వినయం, అతని గొప్ప సంకల్పం, అతని దృష్టి, జాతికి ఉత్తమమైన వాటిని సాధించాలనే అతని సంకల్పం ఎప్పుడూ గర్వించదగినది" అని కొనియాడారు!