Begin typing your search above and press return to search.

అమిత్ షా ఫేక్ వీడియో కేసు... కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ, ఆప్ నేత అరెస్ట్!

రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్లు ఉన్న ఫేక్ వీడియో తీవ్ర వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 May 2024 8:20 AM GMT
అమిత్  షా ఫేక్  వీడియో కేసు... కాంగ్రెస్  ఎమ్మెల్యే పీఏ, ఆప్  నేత అరెస్ట్!
X

రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్లు ఉన్న ఫేక్ వీడియో తీవ్ర వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. పైగా ఇది ఎన్నికల సీజన్ కావడంతో ఈ విషయంపై అటు బీజేపీతో పాటు ఇటు కేంద్ర హోంశాఖ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలకు, ఆప్ నేతలకూ ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి.

ఈ క్రమంలో... ఈ ఈ వ్యవహారంపై గుజరాత్ పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా నకిలీ వీడియోను షేర్ చేశారన్న ఆరోపణలతో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీసులు.. బనస్కంతాకు చెందిన సతీష్ వన్సోలా, దాహోద్ జిల్లాకు చెందిన రాకేశ్ బరియాను అరెస్ట్ చేసిందని తెలుస్తుంది.

వీరిలో సతీష్ వన్సోలా.. గత ఆరేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ వద్ద పీఏగా పనిచేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు! మరోవైపు, రాకేశ్ గత నాలుగేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ దాహోద్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఎడిట్ చేసిన వీడియో వీరిద్దరికీ వాట్సాప్‌ కి రాగా... దాన్ని వారు ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేశారని చెబుతున్నారు.

ఇదే సమయంలో... ఈ వీడియోను ఎవరు ఎడిట్ చేశారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు!!

కాగా... ఏప్రిల్ 23న తెలంగాణలో జరిగిన సభలో పాల్గొన్న సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగిస్తామని తెలిపినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు! అయితే... ఈ వీడియోలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌ షా మాట్లాడినట్టుగా ఉంది! దీంతో... ఈ వీడియో తీవ్ర కలకలం రేపింది!