అమిత్ షా అంచనాలు : బీజేపీ టార్గెట్ కి దూరంగానే ...?
ఈ రెండు దశల అంతర్గత అంచనా ప్రకారం చూస్తే కనుక బిజెపి మిత్రపక్షాలు 100 సీట్లలో ముందంజలో ఉన్నాయని అమిత్ షా చెప్పారు.
By: Tupaki Desk | 30 April 2024 11:30 AM GMTదేశంలో ఇప్పటికి తొలి దశ రెండవ దశలో జరిగిన పోలింగ్ లో మొత్తం 190 ఎంపీ సీట్లకు గాను జనాలు తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పు ఈవీఎంలలో పదిలంగా ఉంది. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశలో 102 సీట్లకు, ఏప్రిల్ 26న జరిగిన రెండవ దశలో 88 సీట్లకు పోలింగ్ ముగిసింది. బీజేపీ అంచనాలు ఏమిటి అంటే వందకు పైగా సీట్లు ఈ రెండు విడతలలో బీజేపీ సొంతం చేసుకోబోతోంది అని బీజేపీ అగ్ర నేత హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆయన గువాహటిలో విలేకరులతో మాట్లాడుతూ, రెండు దశల పోలింగ్ లో తమదే భారీ విజయం అని జోస్యం చెప్పారు. ఈ రెండు దశల అంతర్గత అంచనా ప్రకారం చూస్తే కనుక బిజెపి మిత్రపక్షాలు 100 సీట్లలో ముందంజలో ఉన్నాయని అమిత్ షా చెప్పారు. ఇదిలా ఉంటే 2019లో జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 190 సీట్లలో 93 సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఈసారి ఆ నంబర్ సెంచరీని పై దాటుతుంది అని అమిత్ షా చెబుతున్నారు
అంతే కాదు, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ పెద్ద ఎన్నికల విజయాన్ని చూస్తుందని ఆయన అంటున్నారు. అదే విధంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలో తొలి ట్రెండ్‌ల ప్రకారం దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీకి మంచి స్పందన వస్తోందని ఆయన అంచనాలు వినిపించారు. ఇదిలా ఉంటే మూడో దశ పోలింగ్ మే 7న, నాలుగవ దశ మే 13 జరగనున్నాయి. చివరి దశ జూన్ 1న జరగనుంది. ఓట్లు జూన్ 4న లెక్కిస్తారు.
అయితే బీజేపీ తొలి రెండు దశలలో 190 సీట్లకు వంద అంటే టోటల్ గా మిగిలిన దశలలో ఉన్న మరో 360 సీట్లలో కూడా బీజేపీ అంచనాలనే తీసుకుంటే సగానికే గెలుచుకున్నా కూడా ఆ నంబర్ 280 దాటి వెళ్ళడంలేదు. అది కూడా మిత్రులతో. అంటే బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రధాని మోదీ నేతృత్వంలో రికార్డు స్థాయిలో మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటూంటే ఈ నంబర్ సగానికి సగం అంటే గట్టి పోటీయే ఎదుర్కోబోతోంది కదా అని అర్ధం అవుతోంది అంటున్నారు.
అలా కాకపోతే తొలి మలి దశలలో 190 ఎంపీ సీట్లకు గానూ 150కి పైగా బీజేపీ గెలుచుకుంటే ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో 543 లోక్‌సభ స్థానాలకు గాను 400 స్థానాల్లో విజయం సాధించాలని పెట్టుకున్న లక్ష్యానికి దగ్గరగా వెళ్తుంది అని భావించవచ్చు అంటున్నారు. అయితే ఎన్డీయే కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార కూటమికి సవాలు ఎదురవుతోంది అంటున్నారు.
అమిత్ షా సగానికి సగం సీట్లు మాత్రమే గెలుస్తామని చెబుతూంటే ఇక బీజేపీకి సొంతంగా 370 ఎంపీ సీట్లు కానీ అలాగే ఎన్డీయేకు 400 పై దాటి ఎంపీ సీట్లు కానీ ఎలా వస్తాయన్నది కూడా చూడాల్సిందే అంటున్నారు.