బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే సీఎం... కేసీఆర్ కు అమిత్ షా సవాల్!
స్వయంగా బీజేపీలో నెంబర్ 2 అని చెప్పే అమిత్ షా నోటి నుంచి వచ్చింది. అదే... “బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ వర్గాలకు చెందిన వ్యక్తే సీఎం” అని!
By: Tupaki Desk | 27 Oct 2023 12:48 PM GMTతెలంగాణలో రసవత్తర రాజకీయానికి తెరలేచింది. ప్రధాన పార్టీలన్నీ పోటా పోటీ హామీలు ఇస్తున్న నేపథ్యంలో బీజేపీ సంచలన హామీ ఇచ్చింది. దీంతో... తెలంగాణ రాజకీయాల్లో ఈ హామీ హాట్ టాపిక్ గా మారింది. పైగా అదేదో చిన్న చితకా నేత చెప్పిన మాట కాదు.. స్వయంగా బీజేపీలో నెంబర్ 2 అని చెప్పే అమిత్ షా నోటి నుంచి వచ్చింది. అదే... “బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ వర్గాలకు చెందిన వ్యక్తే సీఎం” అని!
అవును... తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక మాట చెప్పారు! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దళితుడే మొదటి ముఖ్యమంత్రి అని! అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు! ఈ 10ఏళ్ల కాలంలో ఎంత మంది దళితులు కనీసం కేబినెట్ మినిస్టర్లు అయ్యారనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత ఈ విషయంపై తీవ్రస్థాయిలో పోరాటాలు చేయలేని స్థితికి విపక్షాలు పడిపోయాయనే కామెంట్లు వినిపించేవి!
ఆ సంగతి అలా ఉంటే... తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే.. బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని ఆ పార్టీ అగ్రనేత, హోమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన "బీజేపీ జన గర్జన" సభలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... కాంగ్రెస్, బీఆరెస్స్ లు బీసీలకు చేసిందేమి లేదని విమర్శించారు.
ఇదే క్రమంలో... తాము అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ గతంలో హామీఇచ్చి దానిని నెరవేర్చలేదని గుర్తు చేసిన అమిత్ షా... దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. అనంతరం... కేసీఆర్ ఇప్పటికైనా దళితుడిని సీఎంగా చేస్తారా అని అమిత్ షా సవాల్ విసిరారు.
అదేవిధంగా... సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని, సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చూస్తున్నారని చెప్పిన షా... ఈ రెండు పార్టీలు కుటుంబాల కోసం పని చేసేవే అని, అలాంటి కుటుంబ పార్టీలు తెలంగాణను ఎప్పటికీ అభివృద్ధి చేయవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు ప్రధాని మోడీ న్యాయం చేశారని తెలిపారు.
ఇదే ఫ్లోలో... సమ్మక్క-సారక్క పేరుతో ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తాంమని హామీ ఇచ్చిన కేంద్ర హోం మంత్రి షా... పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని.. కృష్ణాజలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు ప్రధాని మోడీ ముందుకు వచ్చారని.. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. దీంతో... ఇప్పుడు తెలంగాణలో బీసీ సీఎం అనే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!