Begin typing your search above and press return to search.

పోలవరానికి పదేళ్ళు చాల్లేదా అమిత్ షా సారూ !

ప్రత్యేక హోదాను ఏపీకి ఇస్తామని చెప్పింది బీజేపీ. అది తిరుపతి వంటి పవిత్ర క్షేత్రంలో.

By:  Tupaki Desk   |   6 May 2024 3:50 AM GMT
పోలవరానికి  పదేళ్ళు చాల్లేదా  అమిత్ షా సారూ !
X

ఏపీని చూస్తే అలాగే మాట్లాడాలనిపిస్తుంది ఏమో. ఏపీ జనాలు మెత్తగా ఉంటారు అని అలుసు కాబోలు. లేదా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేయరని ధీమా కూడా ఉంటే ఉండొచ్చు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పినా మోసపూరిత హామీలు ఇచ్చినా కూడా జనాలు ఓటేసి గెలిపిస్తారు అన్న ధైర్యం కూడా రాజకీయ పార్టీలకూ నేతలకూ చాలా అధికంగానే ఉంది.

ప్రత్యేక హోదాను ఏపీకి ఇస్తామని చెప్పింది బీజేపీ. అది తిరుపతి వంటి పవిత్ర క్షేత్రంలో. ఆ హామీను ఆ తరువాత తుంగలోకి తొక్కింది బీజేపీ పెద్దలే. తాజాగా ధర్మవరం మీటింగుకు వచ్చిన బీజేపీ పెద్ద అమిత్ షా తిరుపతి పవిత్రత కాపాడుతామని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తిరుపతి సరే హామీ ప్రత్యేక హోదా హామీ పవిత్రత ఏమైంది అంటే జవాబు ఉండదేమో.

ఇక విభజన హామీలు పదేళ్ళు అయినా తేలలేదు. ఏపీ తెలంగాణా విడిపోయాక ఉమ్మడి ఆస్తులు లక్షల కోట్ల విలువ చేసేవి హైదరాబాద్ లోనే ఉండిపోయాయి. వాటి లెక్క ఏమిటో తేల్చరు. రెవిన్యూ లోటు భర్తీ చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యారో చెప్పరు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని దిగిపోతూ పోతూ యూపీఏ సర్కార్ ఆమోదించి విభజన చట్టంలో పెడితే పదేళ్ళ కాలంలో పోలవరానికి కేంద్రం ఇచ్చింది అచ్చంగా పదిహేను వేల కోట్లు.

ఇక 2014లో పోలవరం పూర్తికి వేసిన అంచనాలు చూసినా ఆ మొత్తం సగానికి కూడా సరిపోదు. ఇపుడు పదేళ్ళ కాలం గిర్రున తిరిగింది. పోలవరం ప్రాజెక్ట్ కి సవరించిన అంచనాలు దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు అని మూడేళ్ల క్రితం నివేదికలు ఇస్తే వాటిని క్యాబినెట్ లో పెట్టి ఆమోదించడానికి తీరిక లేదు.

ఇపుడు ఎన్నికల వేళ జనం ముందుకు వచ్చి మరో రెండేళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అమిత్ షా చెబుతున్నారు. అది కూడా ఏపీలో ఎన్డీయే కూటమిని గెలిపిస్తేనే అని కండిషన్ ఉంది. పోనీ ఇది సమంజసమే అనుకున్నా 2014 నుంచి 2019 దాకా ఉన్నది కేంద్రంలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారే కదా మరి 2014లో గద్దెనెక్కిన బీజేపీ 2016 నాటికే పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు అన్న ప్రశ్నకు బదులు బీజేపీ పెద్దల వద్ద లేదు అనే అంటున్నారు.

ఇంకో వైపు నుంచి చూస్తే అలా పెరిగిపోతున్న అంచనాలు వాటికి రూపాయి కూడా అదనంగా ఇచ్చేందుకు చేతులు రాని కేంద్రం వీటిని చూస్తున్నపుడు పోలవరం ఎపుడు పూర్తి అవుతుంది అన్నది సగటు ప్రజలకు కలిగే ధర్మ సందేహమే. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్రానిది అయినపుడు రాష్ట్ర ప్రభుత్వాలను నిందించడం ఎందుకు. అసలు జాతీయ ప్రాజెక్ట్ గా ఉన్న పోలవరాన్ని రాష్ట్రం చేతిలో ఎందుకు పెట్టినట్లు. అంటే అక్కడే కేంద్రం చిత్తశుద్ధి ఏమిటో తేలిపోవడం లేదా అన్న ప్రశ్నలూ వస్తున్నాయి.

పోలవరం విషయంలో ముందుగా రాష్ట్రం ఖర్చు చేయాలి. ఆ మీదట తమకు తీరిక ఓపిక మనసు ఉన్నపుడు అనేక విన్నపాలు చేసుకున్న మీదట ఎంతో కొంత రీ ఎంబర్స్ మెంట్ గా విదిలిస్తారు. ఈ మాత్రం దానికి జాతీయ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్పడం అన్న ప్రశ్నలూ ఉన్నాయి. విభజనతో ఏపీ కునారిల్లుతూంటే మళ్ళీ ప్రాజెక్ట్ ని తన ఖజానా నుంచి ఎంత మేరకు ఖర్చు చేయగలదు అన్న ఆలోచన ఎపుడైనా కేంద్రానికి వచ్చిందా అన్నది మేధావుల నుంచి వస్తున్న కీలకమైన ప్రశ్న.

ఇంకో వైపు చూస్తే దశాబ్ద కాలం పోలవరం పూర్తి చేయడానికి సరిపోలేదా అన్న ప్రశ్నలూ పుట్టుకుని వస్తున్నాయి. పోలవరం సంగతి ఇలా ఉంటే అమరావతి రాజధాని విషయంలోనూ అమిత్ షా మంచి మాటలే చెప్పారు. అమరావతి రాజధానిని తాము పూర్తి చేస్తామని. మరి 2014 నుంచి 2019 దాకా ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు అన్నది ఠక్కున వచ్చే ప్రశ్న. అంతే కాదు ఆనాడు శంకుస్థాపన వేళ ప్రధాని నీళ్ళు మట్టి మాత్రమే ఇచ్చారు అన్న విమర్శలకు నాడూ నేడూ కూడా బదులు లేదు కదా అన్న చర్చ వస్తోంది.

అమరావతి రాజధానిని పూర్తి చేయడం అంటే టీడీపీ డిజైన్ చేసిన నవ నగరాలని నిర్మించడమా లేక తాము అనుకున్న బడ్జెట్ లో రాజధాని ఇదిగో అని నిర్మించి ఇవ్వడమా ఈ సంగతి కూడా విపులంగా జనాలకు చెబితే బాగుంటుంది అంటున్నారు. నవ నగరాల నిర్మాణం అంటే లక్షల కోట్ల వ్యవహారం. దానికి బీజేపీ ఎటూ ఓకే అంటుందని ఎవరూ అనుకోరు. పోలవరానికే నిధులు పదేళ్ళలో పదిహేను వేల కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రం అమరావతికి లక్షల కోట్లు ఎందుకు ఇస్తుంది అన్న ప్రశ్న కూడా వస్తుంది.

ఏది ఏమైనా కీలక అంశాలు ఎన్నో అమిత్ షా మిస్ చేశారు అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పలేదు, కడప స్టీల్ ప్లాంట్ ఊసు ఎత్తలేదు, ప్రత్యేక హోదా మాటే మరచారు. కర్నూల్ లో హైకోర్టు అన్నది బీజేపీ 2019 నాటి ఎన్నికల మ్యానిఫేస్టో లో పెట్టిన విషయం. దాని గురించి. లేదు. కానీ రాయలసీమ గడ్డ మీద నిలబడి అమరావతికి జై అంటే అది కూటమికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అన్నది మరో వారంలో జరిగే ఎన్నికలే చెబుతాయని అంటున్నారు.