పాక్ అణుబాంబుకు భయపడం.. పీవోకేను లాగేసుకుంటాం.. బీజేపీ కొత్త రాగం
తొలి దశ సమయంలో ఆ ఊసే లేదు.. మలి దశలోనూ మాట్లాడలేదు.. ఐదు దశలు ముగిసినా అప్పుడప్పుడే లేవెనెత్తారు.
By: Tupaki Desk | 22 May 2024 10:41 AM GMTతొలి దశ సమయంలో ఆ ఊసే లేదు.. మలి దశలోనూ మాట్లాడలేదు.. ఐదు దశలు ముగిసినా అప్పుడప్పుడే లేవెనెత్తారు. కానీ, కీలకమైన రెండు దశలు మిగిలి ఉండగా.. మెజారిటీపై అనుమానం కలిగిందో ఏమో..? బీజేపీ నేతలు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాగం అందుకున్నారు. ఇందులో దాగి ఉన్న మర్మం ఏమంటే.. వచ్చే రెండు దశల్లో ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ ఉండడం. ఈ విధంగా వారిలో ఓ వర్గం ఓట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశం కనిపిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పాకిస్థాన్ అణు బాంబుకు భయపడి ఉంటారేమో కానీ.. తాము తాము పీవోకేని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. బెంగాల్ లోని కంఠిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా ప్రసంగించారు. మమతా దీదీ, కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ లో అణుబాంబు ఉందని భయపెడుతున్నారని.. రాహుల్ బాబా.. అణుబాంబుకు మేం భయపడమని అన్నారు.
ముల్లా మదర్సా మాఫియా
బెంగాల్ లో వామపక్ష ప్రభుత్వాన్ని మా-మాటి-మనుష్ నినాదంతో తృణమూల్ కాంగ్రెస్ కూలగొట్టింది. అలాంటి నినాదాన్ని మమతా పక్కనపెట్టి ముల్లా, మదర్సా, మాఫియాగా మార్చారని షా ఆరోపించారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్, టీఎంసీలు రామమందిరాన్ని అడ్డంపెట్టుకుని కూర్చున్నాయని, మోదీని రెండోసారి ప్రధానిని చేశాక ఐదేళ్లలో కేసు గెలిచి, ఆలయాన్ని కూడా నిర్మించామని చెప్పారు.
మమత ఓటు బ్యాంకు చొరబాటుదారులే
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం మమతను ఆహ్వానించామని.. కానీ, ఓటు బ్యాంకుకు భయపడి ఆమె రాలేదని షా ధ్వజమెత్తారు. అసలు మమత ఓటు బ్యాంకు చొరబాటుదారులేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారికి భయపడి సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అప్పుడు చొరబాట్లు.. ఇప్పుడు ఎదురుదాడి
యూపీఏ హయాంలో పాకిస్థాన్ నుంచి చొరబాటుదారులు దాడులు చేసి పరారయ్యేవారని.. మోదీ ప్రభుత్వం వచ్చాక యురి వంటి ఆపరేషన్లు, వైమానిక దాడులతో ఉగ్ర దాడులకు దీటుగా ప్రతిస్పందించందని అమిత్ షా పేర్కొన్నారు. పాక్ లోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను అంతమొందించామని గుర్తు చేశారు. కానీ, బెంగాల్ మాత్రం చొరబాటుదారులకు స్వర్గంగా మారిందని, చొరబాట్ల అంశం బెంగాల్ కే కాకుండా యావత్ దేశానికి తీవ్ర ఆందోళనకరంగా మారిందని షా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డెమోగ్రఫీ నిరంతరం మారిపోతోందని, మమతా ఓటు బ్యాంకు కోసం దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్ లో అన్ని రకాల పరిశ్రమలు ధ్వంసమయ్యాయని, బాంబు తయారీ పనులు మాత్రమే జరుగుతున్నాయని ఎద్దేశా చేశారు.