హెలీకాప్టర్ లో సమస్య... అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం!
ప్రధానంగా వైఎస్సార్ మరణం అనంతరం... నేతలు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ లలో సాంకేతిక సమస్యలు అనే మాటలు తీవ్ర ఆదోళన కలిగిస్తుంటాయి.
By: Tupaki Desk | 29 April 2024 1:12 PM GMTనేతలు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ లకు సంబంధించిన ఏ విషయం వార్తల్లోకి వచ్చినా...అది తీవ్ర చర్చనీయాంశం అవుతుందనే సంగతి తెలిసిందే. ప్రధానంగా వైఎస్సార్ మరణం అనంతరం... నేతలు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ లలో సాంకేతిక సమస్యలు అనే మాటలు తీవ్ర ఆదోళన కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర హోమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం కంట్రోల్ తప్పిందనే విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అవును... కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు త్రుటిలో ప్రమాదం తప్పింది! ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. బీహార్ లోని బెగుసరయ్ లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన చెలరేగింది.
వివరాళ్లోకి వెళ్తే... బీహార్ లోని బెగుసరయ్ లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా.. ప్రచారం ముగించుకుని హెలికాప్టర్ లో బయల్దేరారు. ఈ సమయంలో... టేకాఫ్ అవుతుండగా అదికాస్తా నియంత్రణ కోల్పోయి కుడివైపు దిశగా ఊగిసలాడింది. ఆ సమయంలోని ఒక దశలో నేలను తాకబోయింది. దీంతో... వెంటనే అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్ ను కంట్రోల్ లోకి తీసుకోవడంతో అది నిర్ణీత మార్గంలో బయల్దేరింది.
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా... గతవారం కూడా అమిత్ షా హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కిందకు దిగలేకపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఏప్రిల్ 21న పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ లో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు వెళ్లిన అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం... వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్ విఫలమైంది. దీంతో ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది.