Begin typing your search above and press return to search.

రాహుల్ ది అహంకారామా ఆత్మ విశ్వాసమా ?

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీది అహంకారం అని బీజేపీ అగ్ర నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటు విమర్శలు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   21 July 2024 4:11 AM GMT
రాహుల్ ది అహంకారామా ఆత్మ విశ్వాసమా ?
X

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీది అహంకారం అని బీజేపీ అగ్ర నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఆయన రాహుల్ ని ఎందుకు ఇంత అహంకారం అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలవని వారు ప్రభుత్వం ఏర్పాటు చేయలేని వారికి అహంకారం అవసరమా అని రాహుల్ మీదనే పంచులు పేలుస్తున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో అహంకారాన్ని ప్రదర్శించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శించారు. జార్ఖండ్‌లోని రాంచీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ,ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అహంకారం వస్తుందని చాలాసార్లు చూస్తున్నాము, కానీ ఓటమి తర్వాత అహంకారంగా మారింది నేను దీనిని మొదటిసారి చూస్తున్నానని షా అన్నారు.

ఎన్నికల్లో ఎవరు గెలిచారో, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అందరికీ తెలుసని పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రవర్తన బాగా లేదని అమిత్ షా అంటున్నారు. ఈ ఎన్నికలలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ వచ్చిందని బిజెపి ఒంటరిగా 240 సీట్లు సాధించిందని ఇది ఇప్పటికీ ఇండియా కూటమి కంటే ఎక్కువ అని షా అన్నారు..

అయితే రాహుల్ ది అహంకారామో లేక ఆత్మ విశ్వాసమో బీజేపీ పెద్దలకు తెలియదా అని కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. వంద ఎంపీ సీట్లకు కాంగ్రెస్ ని రాహుల్ చేర్చారు అని మిత్రులను కలిపి ఉంచుతూ ఇండియా కూటమిని ఏర్పాటు చేశారని దాదాపుగా అధికారం దగ్గరకు వచ్చేశారు అని అంటున్నారు.

రాహుల్ గాంధీ ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ అధికార పార్టీని నిలదీస్తున్నారని దానిని తట్టుకోలేని వారే ఈ విధంగా అహంకారం అని అంటున్నారని చెబుతున్నారు. ఇకపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా రాహుల్ అయితే డేరింగ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన పార్లమెంట్ తొలి సమావేశాలలో చేసిన గంటా నలభై నిముషాల ప్రసంగానికి మంచి స్పందన లభించింది.

మోడీ ప్రభుత్వం తీరు తెన్నులను ఆయన ఎండగట్టారు. ఇక బడ్జెట్ సెషన్ కి సైతం ఆయన గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు. దాంతో అధికార పక్షానికి ఈసారి అసలైన సవాల్ ఎదురు కాబోతోంది. రాహుల్ గాంధీ తో పాటు ఇండియా కూటమి నేతలు అంతా విపక్షంలో ఉన్నారు బిగ్ నంబర్ తో అపొజిషన్ ఉంది. దనతో అధికార బీజేపీకి అయితే ఎక్కడో కలవరం రేగుతోంది అని అంటున్నారు.

గతంలో మాదిరిగా జవాబు చెప్పకుండా సభను ముందుకు నడిపించే వాతావరణం అయితే ఈసారి ఉండదు అని అంటున్నారు ఈ మొత్తం పరిణామాల మధ్య చూస్తే రాహుల్ గాంధీ కంటిలో ముల్లులా మారారని అంటున్నారు అందుకే ఆయనను అహంకారిగా అంటున్నారు అని కూడా పేర్కొంటున్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం రానున్న కాలమంతా తమదే అన్న పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్నారని అంటున్నారు. ఆ తేడాను బీజేపీ పెద్దలే తెలుసుకోవాలని కూడా సూచిస్తున్నారు.