Begin typing your search above and press return to search.

అమిత్ షాతో ఆ మాట చెప్పే ధైర్యం ఆ హీరోది మాత్రమే

ఇప్పుడున్న పరిస్థితుల్లో అమిత్ షాతో మాట్లాడటమంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడినట్లే.

By:  Tupaki Desk   |   23 Aug 2024 4:34 AM GMT
అమిత్ షాతో ఆ మాట చెప్పే ధైర్యం ఆ హీరోది మాత్రమే
X

ఇప్పుడున్న పరిస్థితుల్లో అమిత్ షాతో మాట్లాడటమంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడినట్లే. అలాంటిది ఒక సినీ హీరో.. వెనుకా ముందు ఆలోచించకుండా సింఫుల్ గా చెప్పేసిన సమాధానం సంచలనంగా మారింది. సినిమాల కోసం కేంద్ర మంత్రి పదవిని సైతం వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు తేల్చేసిన మలయాళ సినీ హీరో కం కేంద్రమంత్రి సురేశ్ గోపీ హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం మోడీ సర్కారులో పెట్రోలియం.. సహజ వాయువు.. పర్యాటక శాఖల సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా కేరళ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా అంటే తనకు ప్రాణంగా పేర్కొన్న సురేశ్ గోపీ.. సినిమాల కోసం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయటానికి సైతం వెనుకాడనని చెప్పారు. తాను సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు అమిత్ షా అనుమతి కోరినట్లు చెప్పిన సురేశ్ గోపీ.. ఈ సందర్భంగా జరిగిన ఆసక్తికర సంభాషణను వెల్లడించారు. తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్ ప్రారంభించేందుకు అమిత్ షాను అనుమతి కోరినట్లు చెప్పారు.

ఎన్ని సినిమాలు నటించాలని అనుకుంటున్నారు? అని అమిత్ షా ప్రశ్నిస్తే.. 22 సినిమాలుగా తాను సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. దీంతో.. తాను ఇచ్చిన లేఖను అమిత్ షా పక్కన పెట్టారన్న సురేశ్ గోపీ ‘‘సినిమాలు చేసుకునేందుకు మాత్రం అనుమతి ఇస్తానని అమిత్ షా చెప్పారు.సెప్టెంబరు ఆరో తేదీన ఒట్టకొంబన్ మూవీ షూట్ లో పాల్గొంటున్నా. అటు షూటింగ్ లో పాల్గొంటూనే.. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తా. షూటింగ్ జరిగే సమయంలో నాకు కేటాయించిన మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులను వెంట ఉంచుకుంటా’’ అని వ్యాఖ్యానించారు.

తన పనిని తాను చేయాలనుకుంటున్నానని.. అందుకు కేంద్ర మంత్రి పదవి అడ్డుగా ఉంటే.. దాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ‘‘కేంద్ర మంత్రి పదవిలో ఉండి షూటింగ్ లో పాల్గొన్నందుకు పదవి నుంచి తొలగిస్తే.. బతికిపోయినట్లుగా భావిస్తా. పదవి మీద ఆశ లేదు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల్ని పాటిస్తా. నా కోసం కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. త్రిస్సూర్ ప్రజల కోసం కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్లుగా పార్టీ పెద్దలు చెప్పారు. అలా అని నా అభిరుచికి దూరంగా ఉండాలంటే మాత్రం నేను బతకలేను. సినిమాలు అంటే నాకు ప్రాణం’’ అంటూ సురేశ్ గోపీ కుండబద్ధలు కొట్టిన వైనం ఆసక్తికరంగామారింది.