Begin typing your search above and press return to search.

కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణాదిలో బీజేపీకి దారులు మూసుకుపోతున్నాయనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Aug 2023 4:48 PM GMT
కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!
X

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణాదిలో బీజేపీకి దారులు మూసుకుపోతున్నాయనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. దీంతో ఈసారి తెలంగాణలో ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ పెద్దలు కంకణం కట్టుకున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్స్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ చెబుతున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. అందుకు అనుగుణంగా సత్తా చాటేలా ఖమ్మం గడ్డ నుంచి శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. ఇందులో భాగంగా... "రైతు గోస - బీజేపీ భరోసా" భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన... బీఆరెస్స్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పాలనకు నూకలు చెల్లాయని అన్నారు.

అవును... కేసీఆర్‌ సర్కార్‌ కు కౌంట్‌ డౌన్‌ మొదలైందని అమిత్‌ షా అన్నారు. ఈ సందర్భంగా... కేసీఆర్‌ కారు భద్రాచలం వెళ్తుంది కానీ రాముడి గుడికి వెళ్లదు అని చెప్పిన ఆయన... దానికి కారణం కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ ఓవైసీ చేతిలో ఉండటమే అని అన్నారు. మజ్లిస్‌ తో కలిసి ఉండేవాళ్ల పక్కన మేం కూర్చొం అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా "కేసీఆర్‌ గారూ.. గుర్తు పెట్టుకోండి. ఇక మీ కారు భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలోనే బీజేపీ ముఖ్యమంత్రి భద్రాచలం వెళ్లి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు" అని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా "ఎంఐఎం చేతిలో స్టీరింగ్‌ ఉన్న కారు మనకు కావాలా?" అని ప్రజలను ప్రశ్నించారు.

ఈ క్రమంలో... హైదరాబాద్‌ విముక్తికి 75 ఏళ్లు నిండాయని తెలిపిన అమిత్ షా... తెలంగాణ విమోచనకు పోరాడినా స్వాతంత్ర్య యోధులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అయితే కేసీఆర్ మాత్రం తెలంగాణ అమరవీరుల కలలను కల్లలు చేశారని అన్నారు. బీఆరెస్స్ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పాలిస్తోందని విమర్శించారు.

ఇదే సమయంలో.. బీఆరెస్స్ 2జీ పార్టీ, కాంగ్రెస్‌ 4జీ పార్టీ, ఎంఐఎం 3జీ పార్టీ అని మొదలుపెట్టిన అమిత్ షా... 4జీ, 3జీ, 2జీ కాదు తెలంగాణలో వచ్చేది బీజేపీనే అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో... కాంగ్రెస్‌ 4జీ అంటే నాలుగు తరాల పార్టీ అని.. బీఆరెస్స్ 2జీ అంటే రెండు జనరేషన్ల పార్టీ అని ఎంఐఎం 3జీ అంటే మూడు జనరేషన్ల పార్టీ అని అమిత్‌ షా సెటైర్లు వేశారు.