ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు వేళ నెహ్రు పై అమిత్ షా టార్గెట్!
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు లోక్ సభలో మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి.
By: Tupaki Desk | 12 Dec 2023 5:15 AM GMTదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు లోక్ సభలో మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి. సాధారణంగా సభలో లేని వ్యక్తుల గురించి.. ఈ భూప్రపంచంలో లేని వారి గురించి అదే పనిగా విమర్శలు గుప్పించటంలోనూ.. పరుష వ్యాఖ్యలు చేయటంలోనూ అర్థం లేదు. కానీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తమకు లభించిన అవకాశాన్ని వదిలి పెట్టేందుకు ఆయన ఇష్టపడలేదు. అందుకే.. మరోసారి నెహ్రూపైనా.. ఆయన తీసుకున్న నిర్ణయాలపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంల్ని ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీం తీర్పును ప్రస్తావించటమే కాదు.. అప్పట్లో నెహ్రూ నిర్ణయాలను విమర్శలతో కడిగేశారు. సుప్రీం తీర్పును స్వాగతించిన అమిత్ షా.. ఇప్పటికి ఆర్టికల్ 370 శాశ్వితమైనదని ఎవరైనా అంటే.. వారు భారత రాజ్యాంగాన్ని.. పార్లమెంట్ ను అవమానించినట్లేనని స్పష్టం చేయటం గమనార్హం.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు తర్వాత జమ్ముకశ్మీర్ రాజ్యాంగానికి ఇకపై ఎలాంటి విలువ ఉండదన్న ఆయన.. సరైన సమయంలో జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ తొలి ప్రధాని నెహ్రూ తీసుకున్న నిర్ణయాల్ని తీవ్రంగా తప్పు పడుతూ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
- ఆర్టికల్ 370 జమ్ము కశ్మీర్ లో వేర్పాటు వాదానికి దారి తీసింది. తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది.
- సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిది. కశ్మీరీలకు న్యాయం చేసేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- పాక్ అక్రమిత కశ్మీర్ భారత్ లో భాగం. దాన్ని ఎవరూ ఆక్రమించలేరు. కాదని ఎవరైనా ప్రయత్నిస్తే గట్టిగా బుద్ది చెబుతాం. భారతదేశ అంగుళ భూభాగాన్ని కోల్పోయే ప్రసక్తే లేదు. అందుకు బీజేపీ ఎప్పటికి సిద్ధంగా ఉండదు.
- కేవలం ఒక వ్యక్తి కారణంగా భారత్ లో జమ్ముకశ్మీర్ భాగంగా కావటం ఆలస్యమైంది. కశ్మీర్ లో కాల్పుల విరమణ లేకుంటే.. అసలు పీవోకే ఉండేది కాదు.
- ఆర్టికల్ 370 ముసుగులో మూడు కుటుంబాలు అధికారాన్ని అనుభవించాయి.
- గత 75 ఏళ్లుగా స్థానిక ఎస్టీ ప్రజలు అన్నిహక్కుల్నీ కోల్పోయారు.
- ఆర్టికల్ 370 రద్దుకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రివర్గం.. బీజేపీ పూర్తిగా బాధ్యత వహిస్తోంది.
- వేర్పాటు వాదాన్నిప్రోత్సహించిన నాయకుల్ని కశ్మీర్ ప్రజలు తిరస్కరించారు.
- ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారీ స్థాయిలో దాడులు ఎప్పుడైనా జరిగాయా? పెద్ద సంఖ్యలో ఎవరైనా మరణించారా? ఉరీ.. పుల్వామా సెక్టార్లలో మారణహోమం చేసిన వారిని.. వారి ఇంటికే వెళ్లి మరీ హతమార్చాం. (పాక్ లో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ను గుర్తు చేసేలా)
- భారతదేశంలో ఒకే రాజ్యాంగం.. ఒకే జెండా.. ఒకే ప్రధాని ఉన్నారు.