ఇజ్రాయేల్ (Vs) హమాస్ యుద్ధంపై సినిమా?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం శనివారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది.
By: Tupaki Desk | 15 Oct 2023 10:40 AM GMTఇజ్రాయెల్-హమాస్ యుద్ధం శనివారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఆకస్మిక దాడిని ప్రారంభించి, దక్షిణ ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడితో విరుచుకుపడడంతో వివాదం చెలరేగింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రదాడుల కారణంగా మరణించిన వారి సంఖ్య 1300కి పెరిగిందని, 3000 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్ తెలిపారు.
మృతదేహాలను సేకరించి వారి ప్రియమైన కుటుంబీకులకు అప్పగించే ముందు గుర్తింపు కోసం టెల్ అవీవ్‌కు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇజ్రాయెల్ చరిత్రలో ఎన్నడూ అలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని పేర్కొన్నాడు. గాజాను తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలు శుక్రవారం పిలుపునిచ్చాయి. ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ కోసం వివిధ అంతర్జాతీయ పార్టీలు ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. శాశ్వత శాంతిని సాధించడం ఒక భయంకరమైన సవాలుగా మిగిలిపోయింది. ఇరు వైపులా పౌరులు హింసతో కూడుకున్న దారుణ పరిణామాలకు బలవుతూనే ఉన్నారు.
ఓవైపు యుద్ధభూమిలో రణం కొనసాగుతుండగానే, ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకనిర్మాత క్వెంటిన్ టరాన్టినో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఒక ఇజ్రాయేలీ ఆర్మీ స్థావరాన్ని సందర్శించారు. ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ IDF ధైర్యాన్ని పెంపొందించడానికే ఆయన ప్రయత్నమని X లో ఇజ్రాయెల్ వార్ రూమ్ అధికారిక పేజీ వెల్లడించింది. IDF ధైర్యాన్ని పెంచడానికి లెజెండరీ ఫిల్మ్ మేకర్ క్వెంటిన్ టరాన్టినో ఇక్కడికి వచ్చారని అధికారులు తెలిపారు.
టరాన్టినోకి ఇజ్రాయేల్ కనెక్షన్ ఏమిటి? అంటే ఆ దేశంతో అతడికి చాలా కాలంగా సత్సంబంధాలున్నాయి. అతడి భార్య ఇజ్రాయెలీ సంగీత విద్వాంసురాలు. ఆమె పేరు డేనియెల్లా పిక్. తమ ఇద్దరు పిల్లలతో గత రెండు సంవత్సరాలుగా టెల్ అవీవ్‌లో టరన్టినో గడిపాడు.
ఇజ్రాయేల్ గాజాపై దాడుల నేపథ్యంలో దర్శకుడు టరన్టినో సందర్శనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాపులర్ హాలీవుడ్ డైరెక్టర్ క్వాంటిన్ టరంటినో సౌత్ గాజా పర్యటన దేనికోసం? అంటూ నెటిజనుల్లో వాడి వేడిగా చర్చ మొదలైంది. ఇప్పటివరకూ చాలా టెర్రర్ ఎటాక్ లపై సినిమాలు వచ్చి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. వీటన్నిటినీ మించిన అసాధారణ టెర్రర్ ఎటాక్ గాజాపై జరిగిందనడంలో సందేహం లేదు. దీంతో టరన్టినో ఏదో ఒక ఇతర మోటోతోను ఇక్కడికి వచ్చాడని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
ముంబైపై 26/11 దాడుల సమయంలో సంఘటనా స్థలాల్ని సందర్శించిన టాలీవుడ్ దర్శకుడు ఆర్జీవీ.. సినిమా తీయడానికి కాదు అని అన్నాడు.. కానీ తీసాడు. యుద్ధ స్థలాన్ని లైవ్ గా వీక్షిస్తే సినిమా తీసేందుకు స్ఫూర్తి రగులుతుందని కూడా పలువురు దర్శకనిర్మాతలు గతంలో తెలిపారు. ఇప్పుడు సీనియర్ దర్శకుడు టరంటినో అలాంటి ప్రయత్నం చేస్తారా? అన్నది వేచి చూడాలి.